Haribabu, News18, Rajanna Sircilla
కంటి సమస్యలతో ఏ ఒక్కరూ రాష్ట్రంలో బాధ పడకూడదు అనే లక్ష్యంతో, కంటి సమస్యలు దూరం చేసే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుండి కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ , టీఎస్ఎంఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కుటుంబ, వైద్యారోగ్య శాఖ కమీషనర్ శ్వేత మహంతి, వైద్య శాఖ కార్యదర్శి రిజ్వి, డైరెక్టర్ శ్రీనివాస రావు, తదితర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.., రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాకంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని చేపడుతుందని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు ఈ కార్యక్రమంపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. పేద ప్రజల ఆరోగ్యం, వారి సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, అవసరమైన కళ్ళద్దాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 12వ తేదీ లోపు అన్ని జిల్లాల్లో ఆయా జిల్లాల ఇంఛార్జి మంత్రుల అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించాలని అన్నారు. అలాగే మండల, గ్రామ స్థాయిలో కూడా అవగాహన సమావేశాలు నిర్వహించాలనిమంత్రి సూచించారు.
కంటి వెలుగు క్యాంప్ ల నిర్వహణకు క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రోజు వారీ వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కార్యక్రమ నిర్వహణలో కంటి వెలుగు బృందాలతో పాటు పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖల అధికారులు కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. గ్రామ, మండల , జిల్లా స్థాయిలో కార్యక్రమ నిర్వహణపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఏరోజు, ఎక్కడ క్యాంపు నిర్వహించాలో పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేయాలని, ఈ కార్యక్రమం క్రింద 3 కోట్ల మందిని స్క్రీనింగ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, జిల్లాలో 5 శాతం బఫర్ టీమ్ (అడ్వాన్స్ టీమ్) లు పెట్టుకోవాలని సూచించారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏఎన్ఎం లకు కంటి వెలుగు యాప్ పై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 26 కంటి వెలుగు స్క్రీనింగ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 255 గ్రామ పంచాయితీలు, రెండు మున్సిపాలిటీలలోని అన్ని వార్డుల్లో క్యాంపులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే 26 మంది వైద్యులు, 26 మంది ఆప్తాల్మిక్ టెక్నీషియన్లు, 26 డేటా ఎంట్రీ ఆపరేటర్ల భర్తీ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఇప్పటికే జిల్లాకు 19 ఆటో రిఫ్రాక్టివ్ మెషీన్లు వచ్చాయని, రీడింగ్ కళ్ళద్దాలు కూడా త్వరలోనే వస్తాయని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో జిల్లాలో కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమం విజయవంతం చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ నుండి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్, వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.సుమన్ మోహన్ రావు, పంచాయితీ అధికారి రవీందర్, మున్సిపల్ కమీషనర్లు సమ్మయ్య, అన్వేష్, ప్రోగ్రాం అధికారులు డా. శ్రీరాములు, డా.రజని, డీడీఎం కార్తీక్, తదితరులు హాజరయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harish Rao, Local News, Siricilla, Telangana