Haribabu, News18, Rajanna Sircilla
దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయం (Vemulawada Temple) లో మాస శివరాత్రి సందర్భంగా అర్చక స్వాములు, వేద పండితులు స్వామివార్లకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం అద్దాల మండపంలో మహా లింగార్చన పూజ కార్యక్రమాలు గావించారు. ఉదయం స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు అప్పల భీమా శంకర్ శర్మ ఆధ్వర్యంలో అర్చక స్వాములు, వేద పండితులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పరివార దేవతలకు సైతం శాస్త్రోక్తంగా అభిషేక పూజా కార్యక్రమాలు గావించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాయంత్రం ఆలయంలోని అద్దాల మండపంలో అర్చకులు వేద పండితులు మాస శివరాత్రి సందర్భంగా మహాలింగార్చన పూజ కార్యక్రమాన్ని ఘనంగా చేశారు. ముందుగా జ్యోతులను లింగాకారంలో వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివార్లను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సేవలు తరించారు. మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి..? మాస శివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలి? ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిథిని మాసశివరాత్రిగాపరిగణిస్తారు. ముఖ్యంగా శివరాత్రి అనగా పరమశివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. పరమశివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే "మాస శివరాత్రి".
మాస శివరాత్రిని జరుపుకోవడము వలన ఉపయోగాలు..
ప్రత్యేకించి ఈ రోజును శాస్త్రీయంగా జరుపుకోవడంతో జాతకములోని క్షీణ చంద్ర దోషాల యొక్క తీవ్రత తగ్గు ముఖం పడుతుందని, సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుందని, వృత్తికి సంబంధించిన అవరోధాలలో మార్పు కల్గుతుందని అర్చకులు చెబుతున్నారు. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం, మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుందని, ప్రతి మాస శివరాత్రిని శాస్త్రోక్తంగా జరుపుకోవడం ద్వారా శుభాలు పొందుతారని అర్చకులు, వేద పండితులు చెబుతున్నారు.
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో ప్రతినెల అమావాస్యకు ముందు రోజు మాస శివరాత్రి సందర్భంగా ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగాల్సిన పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు సైతం మహాలింగార్చన పూజ తిలకించేందుకు భక్తులు తరలివచ్చి స్వామివారి సేవలో తరించారు. ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పాటు స్వామివార్లను రంగురంగుల పుష్పాలతో శోభాయామనంగా అలంకరించారు. మాస శివరాత్రి మహా లింగార్చన పూజ కార్యక్రమంలో నేపథ్యంలో స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Siricilla, Telangana, Vemulawada