ఈ మధ్య గుండె పోటు మరణాలు (Heart Attack Deaths) ఎక్కువగా సంభవిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ(Telangana)లో హార్ట్ ఎటాక్‌తో చనిపోయే వారి సంఖ్య గత కొన్ని రోజులుగా పెరుగుతోంది. ఒకప్పుడు 65 ఏళ్లు పైబడిన పెద్ద వారిలో గుండెపోటు వచ్చేది. కానీ ఇఫ్పుడు నిండా పాతికేళ్ల వయసు కూడా లేని యువతకు కూడా హార్ట్ ఎటాక్ వస్తోంది. అప్పటి వరకు యాక్టివ్‌గా ఉన్న వారు కూడా.. అకస్మాత్తుగా కుప్పకూలుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ (Karimnagar) జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో కనీసం లక్ష మందికి ఉచితంగా గుండెపరీక్షలు చేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వ వైద్య విభాగంతో పాటు ఐఎంఏ, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో కలిసి డిగ్రీ, ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు, పలు విభాగాల్లో పనిచేసే వారందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నారు. అంతేకాదు గుండెపోటుపై అందరికీ అవగాహన కల్పించనున్నారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించారు. యువతకు లిపిడ్ ప్రొఫైల్ రక్త పరీక్ష, ఈసీజీ, టూడీ ఎకో వంటి పరీక్షలన్నీ ఉచితంగా చేయనున్నారు. ఏదైనా సమస్య ఉన్నట్లు గుర్తిస్తే.. అందుకు తగిన వైద్యం అందిస్తారు.
మొదట ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కళాశాలలో గుండె పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ఉచిత గుండె పరీక్షల కార్యక్రమంలో ఫిజీషియన్లు, గుండె సంబంధ వైద్య నిపుణులు, ఆసుపత్రుల సిబ్బందిని భాగస్వాములుగా చేస్తారు. కాలేజీల అనంతరం.. కరీంనగర్‌లోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి హార్ట్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఆ తర్వాత విడతల వారీగా జిల్లావ్యాప్తంగా విస్తరించనున్నారు.
గుండె పోటు వచ్చినప్పుడు ఏం చేయాలన్న దానిపై విద్యార్థులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. గుండె కొట్టుకోవడం ఆగిపోయి పడిపోయినప్పుడు తీసుకోవాల్సిన చర్యలేంటి? సీపీఆర్ ఎలా చేయాలి? అనే దానిపై ఇప్పటికే నగర శివారులోని ఓ కళాశాల విద్యార్థులకు శిక్షణనిచ్చారు. కరీంనగర్ ప్రతిమ వైద్య కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, మున్సిపల్ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, పోలీసు తదితర విభాగాల వారికి కూడా గుండెపోటు, సీపీఆర్‌పై అవగాహన కల్పించారు.
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా కరీంనగర్ జిల్లాలో గుండె జబ్బు నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయాలని నిర్ణయించినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అవసరమైతే ప్రత్యేక నిధులను సమకూర్చుతామని అన్నారు. ఆకస్మిక గుండెపోట్లను అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Heart Attack, Karimnagar, Local News, Telangana