(K.Haribabu,News18,Rajanna siricilla)
రాజన్న సిరిసిల్ల sircillaజిల్లా కేంద్రంలో ఉంది అగ్రహారం జోడాంజనేయ స్వామి (Jodanjaneya Swami)ఆలయం. వాహన పూజ ఇక్కడ ప్రత్యేకత. దూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి వాహనాల పూజ చేయించుకుంటారు. ముఖ్యంగా ఈమార్గంలో వెళ్లే లారీ డ్రైవర్లు(Lorry drivers)తప్పనిసరిగా ఆగి స్వామి వారిని దర్శించుకుని ధైర్యంగా ముందుకెళ్తుంటారు. ఈ ఆలయం 1957వ సంవత్సరంలో కరీంనగర్ వాస్తవ్యులైన గౌరిశెట్టి రాజేష్ (Gaurishetti Rajesh)అనే వ్యాపారి కరీంనగర్(Karimnagar)జిల్లా నుంచి కామారెడ్డి ప్రాంతానికి లారీలో బెల్లం తరలిస్తుండగా…లారీ అగ్రహారం వద్ద ఆగిపోయింది. రాత్రికి అక్కడే నిద్రపోతున్న సమయంలో ఆంజనేయస్వామి కలలోకి వచ్చిన పక్కనే ఉన్న పొదల్లో వెదికితే తాను కనిపిస్తానని చెప్పిన అదృశ్యమయ్యాడట. వ్యాపారి తెల్లవారు జామున పొదల్లో వెదకగా రెండు ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపించడంతో ఆంజనేయస్వామి పరమభక్తుడిగా మారిపోయాడు. స్వామివారికి అక్కడే ఆలయం నిర్మించాడు.
రెండు రూపాల్లో స్వామి వారి దర్శనం..
అగ్రహారంలోని సంకట విమోచన భక్త వీరాంజనేయస్వామి క్షేత్రంలో రెండు రూపాల్లో స్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఒకటి భక్తాంజనేయ స్వామిగా రెండవది వీరాంజనేయ స్వామి రూపంలో కనిపిస్తారు. రెండు రూపాయల్లో కనిపిస్తారు కాబట్టే దీన్ని జోడాంజనేయస్వామి ఆలయంగా పిలుస్తారు. ఆనాటి కాలంలోనే ఆలయ నిర్మాణం పూర్తి చేసి..1958లో స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఇక్కడ వాహన పూజ ప్రత్యేకం..
కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వాళ్ల ఈ జోడాంజనేయస్వామి ఆలయంలో వాహనపూజ చేయిస్తే వాహనగండం తొలగిపోతుందని భక్తల విశ్వాసం. అందుకే ఇక్కడికి పూజల కోసం నిత్యం వందల సంఖ్యలో వాహనాలు వస్తాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం తర్వాత అగ్రహారం ఆంజనేయ స్వామి ఆలయంలోనే ఎక్కువగా వాహన పూజలు జరుగుతాయని అర్చకులు చెబుతుంటారు. ఏటా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అలాగే పెద్ద జయంతి, చిన్న జయంతికి హనుమాన్ మాలలు ధరించడానికి ఈ క్షేత్రానికి
భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.
గ్రహ దోషాలు, పీడలు తొలగిపోతాయి..
గ్రహ దోషాలు, పీడలు తొలగాలంటే ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అగ్రహారం ఆంజనేయ స్వామి వారి ఆలయ ఆవరణలో మహా శివుని ఆలయం, శ్రీ సరస్వతీ మాత ఆలయం, తులసి మాత అమ్మవారి ఆలయం, నవగ్రహాల మండపం ఉంది. ప్రతిరోజు అంజనీ పుత్రుడునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మంగళ, శుక్ర, శనివారాల్లో అగ్రహారం ఆంజనేయ స్వామివారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
ఎలా వెళ్లాలంటే ..
ఈ భక్త వీరాంజనేయ స్వామి క్షేత్ర నిర్మాణానికి దాతలు రెండెకరాలకుపైగా భూమిని దానం చేశారు. ఈ ఆలయానికి కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి నుంచి వెళ్లొచ్చు. ఈ ఆలయం సిరిసిల్ల నుంచి 7కిలోమీటర్ల దూరంలో ఉంది. కరీంనగర్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వారు కరీంనగర్ లేదా సిరిసిల్ల నుంచి వెళ్లి స్వామివారిని ద్రశించుకోవచ్చు. జోడాంజనేయ స్వామి ఆలయానికి 6 కిలోమీటర్ల దూరంలో వేములవాడ శ్రీ రాజన్న గుడి, 65కిలోమీటర్ల దూరంలో కొమురవెల్లి మల్లన్న ఆలయం ఉంటుంది. ధర్మపురి నరసింహ స్వామి వెళ్లాలనుకునే వారు మరో 75కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.