(K.Haribabu,News18, Rajanna siricilla)
వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి పుణ్య క్షేత్రంలో శ్రీరామ భక్తోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీరామనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు నుంచి తొమ్మిదో రోజు వరకు మూడు రోజులపాటు నిర్వహించే శ్రీరామ భక్తోత్సవంలో తొలిరోజు ఉదయం రాజన్న ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ నేతృత్వంలో వేదపండితులు, అర్చకులు స్వస్తిపుణ్యవచనము, గౌరీపూజ, పంచగవ్వ మిశ్ర ణం, ఋత్విక్ వరుణము, యాగశాల ప్రవేశం, మండ పారాధన పూజ శాస్త్రోక్తంగా గావించారు. అర్చకులకు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ వరుణి అందజేశారు. అంతకుముందుగా శ్రీరాజరాజేశ్వరస్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సీతారామచంద్రస్వామివారికి ఉపనిషత్ అభిషేక పూజలునిర్వహించారు.
అనుబంధ పరివార దేవతలకు అభిషేకాలు, రాత్రి పార్వతీ రాజరాజేశ్వరస్వామి, లక్ష్మిఅనంత పద్మ నాభస్వామివార్లను హంస వాహనంపై ఊరేగించారు. సీతారామ కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 30వ తేదీ గురువారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారామచంద్రస్వామివార్ల దివ్యకల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు అర్చకులు చెబుతున్నారు.
ఇందుకోసం ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ముందుభాగంలో వేదికను సిద్ధం చేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని హరి హర క్షేత్రంగా, దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పర్వదినం నేపథ్యంలో తొమ్మిది రోజులపాటు శ్రీరామనవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం మహోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది.
లక్షల్లో స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు రానున్న నేపథ్యంలో భక్తులకు ఏలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆలయ పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్ళులను ఏర్పాటు చేశారు. స్వామి వారి దివ్య కళ్యాణం తిలకించేందుకు వీలుగా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
స్వామివారి దివ్య కళ్యాణ అనంతరం రాత్రి ప్రత్యేక పూజ కార్యక్రమాలు, అనంతరం స్వామివార్లు రథోత్సవంపై పట్టణ పురవీధుల గుండా విహరిస్తూ పట్టణ ప్రజలకు, భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. లక్ష వరకు భక్తులు వస్తారనే అంచనాతో ఆలయ పరిశ్రమతో పాటు పార్కింగ్ ఏరియా ప్రాంతాల్లో చల్లని మంచినీటితో పాటు మజ్జిగ ప్యాకెట్స్, అన్నదాన ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. ప్రతి సంవత్సరం రాజన్న ఆలయంలో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆలయ అధికారులు ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna sircilla, Srirama navami, Telangana