RAJANNA SIRCILLA GOVT SCHOOL IS DEVELOPED LIKE A CORPORATE SCHOOL IN MALKAPETA VILLAGE OF RAJANNA SIRCILLA DISTRICT SNR RKH BRV
Rajanna Sircilla: పుట్టిన ఊరుపై మమకారం: సొంత డబ్బుతో బడి, గుడి నిర్మాణం
(సిరిసిల్ల శ్రీమంతుడు)
Sircilla: సొంత ఊరి ప్రజలకు చేతనైన సహాయం చేయాలన్న తండ్రి ఆలోచనను అర్ధం చేసుకున్న చెల్మెడ లక్ష్మీనరసింహ రావు, అనుకున్న విధంగానే మల్కపేట గ్రామంలో బడి, గుడి నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు
(K.Haribabu,News18, Rajanna siricilla)
ఒక్కసారి పదవి చేపడితే..తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు నేటి తరం రాజకీయ నేతలు. సమాజం కోసం నేతలు పాటుపడతారని భావించి, ప్రజలు వారికి ఓట్లేసి గెలిపిస్తున్నారు. కానీ ప్రజల సమస్యల పట్ల మాత్రం ఆ నేతలు కినుకు వహిస్తున్నారు. అయితే అందరు నేతలు అలా ఉన్నారని చెప్పలేం. ప్రజల పట్ల, సేవ పట్ల అంకిత భావంతో పనిచేసే నేతలు ఉన్నారు. అటువంటి అరుదైన నేతలే చెల్మెడ ఆనందరావు(Chelmeda Anandarao), ఆయన తనయుడు చెల్మెడ లక్ష్మీనరసింహ రావు(Lakshminarasimha Rao). రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన చెల్మెడ ఆనందరావు తన సొంతూరిపై మమకారంతో ఆ ఊరిని తనకు చేతనైనంత మేరకు అభివృద్ధి చేయాలనీ సంకల్పించారు. జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి మానవీయ విలువలకు ప్రాధాన్యమిచ్చిన మానవతావాది ఆనందరావు. చదివిన బడి, పుట్టిన ఊరుకు ఉపకారిగా నిలుస్తూ ఆనందరావు, మరియు వారి కుటుంబ సభ్యులు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఊరికి ఉపకారం..నిస్వార్ధ సేవ:
రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన చెల్మేడ ఆనందరావు గతంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. రాజకీయాల్లోనూ వ్యక్తిగతంగానూ ఎన్నో ఉన్నతశిఖరాలను అధిరోహించిన ఆనందరావు..ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఒక సామాన్య జీవితం గడిపేవారు. ఎంత ఎదిగినా జీవితంలో ఇంకా ఏదైనా చేయాలన్న తపన మిగిలిపోయింది. సొంతూరిపై ప్రేమ, చదువుకున్న పాఠశాల పట్ల మమకారం పెంచుకున్నారు. ఊరు కోసం ఏదైనా చేయాలని కంకణం కట్టుకున్నారు. తన తల్లి జానకీదేవి పేరు మీద రూ.2 కోట్లతో కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను, గ్రామంలో రామాలయం నిర్మించాలని తలపించారు ఆనందరావు. కానీ వయస్సు భారంతో ఆ బాధ్యతను తన కుమారుడు చెల్మెడ హాస్పిటల్ చైర్మన్ లక్ష్మీనరసింహ రావుకు అప్పగించారు.
మంత్రి సహకారంతో మోడ్రన్ స్కూల్ :
సొంత ఊరి ప్రజలకు చేతనైన సహాయం చేయాలన్న తండ్రి ఆలోచనను అర్ధం చేసుకున్న చెల్మెడ లక్ష్మీనరసింహ రావు, అనుకున్న విధంగానే మల్కపేట గ్రామంలో బడి, గుడి నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే అప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అధునాతనంగా తీర్చి దిద్దేందుకు గానూ \"మన ఊరు-మన బడి\" కార్యక్రమాన్ని ప్రారంభించింది. సొంత ఊరులో బడుల అభివృద్ధికి ముందుకు రావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చెల్మెడ లక్ష్మీనరసింహారావు, మంత్రి కేటీఆర్ ను కలిసి జానకీ దేవి మెమోరియల్ ట్రస్టు ద్వారా మల్కపేట గ్రామంలో నిర్మించబోతున్న పాఠశాల నిర్మాణం గురించి వివరించారు. లక్ష్మీనరసింహారావు ఆలోచనను మంత్రి కేటీఆర్ మనస్పూర్తిగా అభినందించి వెన్నుతట్టడంతో...2021 జులై ఒకటవ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ చేతుల మీదుగా పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 9 నెలల వ్యవధిలోనే పాఠశాల నిర్మాణం పూర్తయింది.
కార్పొరేట్ స్కూల్కు ధీటుగా సర్కారు బడి:
చెల్మెడ జానకీదేవి ట్రస్ట్ ద్వారా నిర్మించినప్పటికీ పాఠశాల నిర్వహణ మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ పాఠశాలలో ఎన్నో అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. పాఠశాలలో 8 విశాలమైన తరగతి గదులు ఉన్నాయి. ఒక్కో గదిలో సుమారు 100 మంది విద్యార్థులు విద్యను అభ్యసించవచ్చు. పాఠశాల తరగతి గదుల్లో డెస్క్ బెంచీలు, క్రీడా సామాగ్రి, కంప్యూటర్లు, డిజిటల్ బోధనకు సౌకర్యంగా ప్రొజెక్టర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజనానికి విశాలమైన వంటగది, విద్యార్థులను ఆకట్టుకునేలా తరగతి గదుల నిర్మాణం, పాఠశాల వరండాలో విద్య ప్రాముఖ్యత తెలిసేలా అందమైన చిత్రాలను గియించారు. విద్యార్థుల ఆటలకు అనుగుణంగా విశాలమైన క్రీడా మైదానం ఏర్పాటు చేశారు. బాలబాలికలకు వేర్వేరుగా మోడల్ టాయిలెట్లు నిర్మించారు.
భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా బడి,గుడి నిర్మాణం:
గ్రామంలో చిరస్థాయిగా నిలిచి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఈ పాఠశాలను నిర్మించినట్లు జానకీదేవి ట్రస్ట్ సభ్యులు, చెల్మెడ హాస్పిటల్ చైర్మన్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు పేర్కొన్నారు. పుట్టిపెరిగిన ఊరికి ఏదైనా చేయాలని తన తండ్రి ఆనందరావు ఎల్లప్పుడు తమ కుటుంబ సభ్యులతో చర్చించేవాడని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావడానికి విద్య అనేది సరైన మార్గమని భావించి పాఠశాల నిర్మాణం, ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి, మనశ్శాంతి, భక్తి భావం పెంచడానికి రామాలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆ బాధ్యతను తనకు అప్పగించడం చాలా సంతోషకరమని, గ్రామంలో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని ప్రస్తుత, భవిష్యత్ తరాల వారు ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదిగితే సంతోషిస్తామన్నారు.
సిరిసిల్ల శ్రీమంతుడు:
స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు అధ్యక్షతన మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్,రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. చెల్మెడ లక్ష్మీ నరసింహారావు తమ ఆస్పత్రి ద్వారా హెల్త్ క్యాంపులు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తున్నారు. అన్ని సౌకర్యాలతో గొప్ప పాఠశాలలు నిర్మించడం సంతోషంగా ఉందని గ్రామ వాసులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.