Haribabu, News18, Rajanna Sircilla
రైతులు పండించేందుకు, విక్రయించేందుకు కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) లో వరి ధాన్యాన్ని అరబెట్టుకునేందుకు కల్లాలు లేక రోడ్ల పైన ఆరబెట్టే పరిస్థితి నెలకొంది. ప్రతిసారి కల్లాలు లేక రైతులు వరి ధాన్యం కుప్పలను కేంద్రాల వద్ద లేక రోడ్ల పైనా పోసుకుంటున్నారు. రోడ్డు వెంట వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాత్రి వేళల్లో ప్రమాదాలు చోటుచేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఈజీఎస్ నిధుల ద్వారా రైతులు తమ పంట పొలాల వద్దనే కల్లాలు నిర్మించుకునే అవకాశం ఉన్నప్పటికి, కొత్త నిబంధనల మేరకు రైతులు నిర్మాణాలకు ఆసక్తి చూపడం లేదు. దీంతో కోనరావుపేట మండలంలో కల్లాల నిర్మాణం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దానికి తోడు ప్రభుత్వం నిర్మాణాలు కొత్త నిబంధనలు తీసుకరావడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి.
ఈ సీజన్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు వరి ధాన్యం కుప్పల వద్దనే పడిగాపులు పడే పరిస్థితి నెలకొంది. వరి పంటను కోసిన వెంటనే పొలం వద్దనే ఉన్న కల్లం వద్ద ఆరబోసుకోని, తెమ లేకుండా కేంద్రానికి తీసుకువచ్చేందుకు కల్లాలు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. మొదట రైతుల కల్లాలు నిర్మించుకునేందుకు అవగాహన లేకపోవడంతో రైతులు ముందుకు రాలేదు.
అయినప్పటికీ అధికారులు సదస్సుల ద్వారా అవగహన కల్పించడంతో కొంత మంది మాత్రమే కల్లాల నిర్మాణాలు చేపట్టారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 50 చదరపు మీటర్ల కల్లానికి రూ.58 వేలు, 60 చదరపు మీటర్ల కల్లానికి రూ.68 వేలు, 75 చదరపు మీటర్ల కల్లానికి రూ.85 వేల నిధుల వ్యయాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఎస్సీ, ఎస్టీల రైతులకు పూర్తిగా సబ్సిడీ పై ప్రభుత్వం నిధులు మంజూరుచేయగా, బీసీ, ఓసీ రైతులకు నిర్మాణం వ్యయంలో పది శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతి యేటా వరి కోత సమయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కల్లాలకు అనుమతులు ఇచ్చినా నిధులు సక్రమంగా రాకపోవడంతో నిర్మాణం దశలోనే నిలిచిపోవడంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జూన్ లో వేసిన వరి కోతకు రావడతో పలు గ్రామాల రైతులు కోస్తున్నారు. ధాన్యం అరబోసేందుకు పొలాల్లో చోటులేకపోవడం, బురద ఉండడంతో ఎక్కువ మంది రోడ్లపైనే అరబోస్తున్నారు. వరి కోతలు ఒకేసారి రావడంతో హార్వెస్టర్లకు కూడా డిమాండ్ పెరిగింది.
దీంతో హార్వెస్టర్ యజమానులు ధరలను అమాంతం రూ.2500 నుంచి 2800 పెంచారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రైతులు పొలాల వద్ద కల్లాలు నిర్మించుకునేలా వారికి అవగాహన కల్పించి, నిర్మించుకున్నవారికి ఎలాంటి షరతులు పెట్టకుండా వెంటనే నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Siricilla, Telangana