(K. Haribabu, News18, Rajanna siricilla)
అసలే ప్రభుత్వ పాఠశాల, ఆపై మారుమూల ప్రాంతం. కనీస వసతులు కూడా లేవంటూ విద్యార్థులు ఆ బడికి రావడం మానేశారు. రెండు గదులు, ఇద్దరు ఉపాధ్యాయులున్న ఆ ప్రభుత్వ పాఠశాలను (Government school) చూసి..తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపించారు. ఇదీ రాజన్నసిరిసిల్ల (Rajanna siricilla) జిల్లా వేములవాడ (Vemulawada) మున్సిపల్ ఏరియాలోని బాలనగర్ గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (Government Primary School) పరిస్థితి. కరోనా ప్రారంభానికి సరిగా ఏడాది ముందు ఈ పాఠశాల మూతపడింది. ఇక్కడ చదివేందుకు ఒక్క విద్యార్థి (Student)కూడా ఆసక్తి చూపక పోవడంతో మూడేళ్ళ క్రితం ఈ పాఠశాలను విద్యాశాఖ అధికారులు మూసివేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఉపాధ్యాయులు ఊరడి రవి (ravi), రాజులు (raju) కృషి చేస్తున్నారు.
'బడి బాట'పై ఇంటింటికీ అవగాహనతో మారిన పరిస్థితి..
బాలనగర్ (Balanagar) గ్రామంలోని ప్రాథమిక పాఠశాల (Primary school) విద్యార్థులు రాక మూడేళ్లుగా మూతపడింది. అన్ని పాఠశాలలు కరోనా కారణంగా మూతపడితే ఈ పాఠశాల మాత్రం అంతకు ఏడాది ముందే మూతపడింది. అయితే బాలనగర్ పరిధిలో పాఠశాలకు వెళ్లే చిన్నారులు అనేక మంది ఉన్నా, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను వదిలి మరొక ప్రాంతానికి వెళ్లడంతో ఇక్కడి ఉపాధ్యాయులు (Teachers) ఆలోచనలో పడ్డారు. ఈ ఏడాది నుంచి తెలంగాణలో పూర్తి స్థాయిలో పాఠశాలలు తెరుచుకోవడంతో, ఈసారి ఎలాగైనా విద్యార్థులను బడికి రప్పించాలని కంకణం కట్టుకున్నారు ఉపాధ్యాయులు రవి, రాజు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట" కార్యక్రమంతో విద్యార్థులు, తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఉపాధ్యాయుడు ఊరడి రవి, సహా ఉపాధ్యాయులు రాజుతో కలిసి ఇంటింటికీ తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం (English medium) కూడా అందుబాటులోకి వచ్చిందని, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వివరించారు.
విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనూహ్య స్పందన..
బాలనగర్ ప్రాథమిక పాఠశాలకు పూర్వవైభవం తేవాలన్న టీచర్ రవి ఆకాంక్షకు బలం చేకూరుస్తూ.. ఒకే రోజు 18 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో అక్షరాభ్యాసం చేశారు ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు 18 మంది విద్యార్థులు పాఠశాలకు రాగా, వారికి ఆయనే స్వయంగా బుక్స్, బ్యాగులు కొనుగోలు చేసి, స్థానిక ఎంఈవో బన్నాజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం మండల విద్యాధికారి.. బన్నాజీ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలను బతికించుకొని అందివస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ప్రైవేట్ పాఠశాలలను వదిలి, ప్రభుత్వ పాఠశాలకు..
బాలనగర్ గ్రామ పరిధిలోని ప్రాథమిక పాఠశాల తిరిగి తెరుచుకోవడంతో పాటు, ఇంగ్లీష్ మీడియం (English medium) కూడా ప్రవేశపెట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడే అడ్మిషన్లు తీసుకున్నారు. ప్రైవేటు పాఠశాలకు వెళ్లే కొందరు విద్యార్థులు కూడా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలకు రావడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ఉపాధ్యాయుడు చేస్తున్న కృషిని పలువురు ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు అభినందించారు. ఈ పాఠశాలను అత్యుత్తమ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు ఉపాధ్యాయుడు రవి పేర్కొన్నాడు.
బడిబాట (Badi Bata) కార్యక్రమం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు ఎంతగానో దోహదపడిందని రవి అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం (English medium) బోధన అందుబాటులోకి రావడం సంతోషించాల్సిన విషయం అని అన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్యను తమ పిల్లలకు అందేవిధంగా కృషిచేయాలని ఉపాధ్యాయుడు రవి విజ్ఞప్తి చేస్తున్నాడు.
అయితే బాలనగర్ ప్రాథమిక పాఠశాలలో కనీస వసతులు కరువయ్యాయి. మూడేళ్ళుగా నిర్వహణ లేక పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. విద్యార్థులు నేలపై కూర్చుంటున్నారు. తాగేందుకు మంచి నీరు కూడా ఉపాధ్యాయులు కొని తీసుకువస్తున్నారు. మండల విద్యాధికారులు స్పందించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: English medium, Local News, School, Siricilla, Telangana schools, Vemulawada