(K. Haribabu, News18, Rajanna Sircilla)
రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా వేములవాడ (Vemula wada)పట్టణంలో అంతర్గత రోడ్లు అద్వానంగా తయారయ్యాయి. మంత్రి కేటీఆర్ (KTR) ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రోడ్ల (Roads) దుస్థితి చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వేములవాడ పట్టణంలో రహదారులు ధ్వంసమై పట్టణ ప్రజలు, రాజరాజేశ్వర స్వామి వార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని రెండవ బైపాస్ ప్రాంతంలో రోడ్లు గుంతల మయమైంది. బద్ది పోచమ్మ ఆలయ సమీపంలో (Pochamma Temple) సైతం రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మత్తులు చేయాలనీ స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
దెబ్బతిన్న అంతర్గత రోడ్లు: గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు (Rains) వేములవాడ పట్టణంలోని పలు వార్డులలో రోడ్లు దెబ్బతిన్నాయి. ఎటు చూసినా రోడ్లు గుంతల మయంగా మారి దర్శనమిస్తున్నాయి. రోడ్డుపై గుంతలలో వర్షపు నీరు నిలిచి పాదచారులకు నరక ప్రాయంగా మారిందని పట్టణ వాసులు చెబుతున్నారు. పట్టణంలోని మొదటి బైపాస్ ప్రాంతంలో డి.ఎస్.పి కార్యాలయం సమీపంలో రోడ్డు గతుకులుగా తయారైంది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని రెండో బైపాస్ ప్రాంతంలో కూడా రోడ్డు మరీ అద్వానంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపల్, సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదాలు జరగక ముందే రోడ్లకు మరమ్మత్తులు చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
వేములవాడలో రోడ్లు ధ్వంసం అయిన విషయంపై వేములవాడ సిపిఐ నాయకుడు కడారి రాములు ఆధ్వర్యంలో పట్టణంలోని అమరవీరుల స్థూపాల వద్ద నిరసన తెలిపారు. పట్టణంలో గత మూడు నాలుగు రోజులుగా కురిసిన అధిక వర్షాలకు రోడ్లన్నీ జలమయంగా మారాయని, అధికారులకు సరైన ప్రణాళిక లేకపోవడంతోనే రోడ్లపైకి నీరు చేరి రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయని పేర్కొన్నారు. ధ్వంసమైన రోడ్లన్నిటిని వెంటనే మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Road map, Sircilla, Vemulawada