Haribabu, News18, Rajanna Sircilla
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రగతిలో ఉన్న పనుల్లో వేగం పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. వీర్నపల్లి మండలం వన్పల్లి గ్రామంలోని ప్రాథమిక పరిషత్ ప్రాథమిక పాఠశాలను, వీర్నపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను క్షేత్ర స్థాయిలో సందర్శించి, మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. ముందుగా వన్ పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్, మన ఊరు - మన బడి పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్, టాయిలెట్లు, డ్రింకింగ్ వాటర్ సదుపాయం, ఇతర మరమ్మత్తులు చేపడుతున్నట్లు కలెక్టర్ కు అధికారులు వివరించారు. పనుల పురోగతిలో వేగం పెంచాలని, వచ్చే సంక్రాంతి లోగా పనులన్నింటినీ పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన తొలిమెట్టు కార్యక్రమం అమలుపై కలెక్టర్ సమీక్షించారు. స్వయంగా పిల్లలతో మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులు ధారాళంగా చదివేలా, రాసేలా, గణితంలో చతుర్వేద ప్రక్రియలు చేసేలా చూడాలని అన్నారు.
అనంతరం కలెక్టర్ వీర్నపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. మన ఊరు- మన బడి తో పాటు CSR నిధులతో నిర్మిస్తున్న భవనాన్ని పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న పనుల పురోగతిలో వేగం పెంచి, యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.పాఠశాల ప్రాంగణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంను కలెక్టర్ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా పిల్లలకు అందిస్తున్న సేవల తీరుపై ఆరా తీశారు. పిల్లలు ఎత్తుకు సరిపడా బరువు ఉన్నారా లేదా అని అంగన్వాడీ టీచర్ ను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు పౌష్టికాహారం ప్రతిరోజూ అందించాలని సూచించారు.
అంతకముందు కలెక్టర్ గర్జనపల్లి గ్రామంలోని గ్రామ పంచాయితీ కార్యాలయ ఆవరణలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. మండలంలో ఇప్పటివరకు గర్జనపల్లి, మద్దిమల్ల, వీర్నపల్లిలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 4వ తేదీ నుండి రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించాలని ఆదేశించారు. ఇండ్ల నిర్మాణాలను రాబోయే 3 నెలల్లోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి డా.రాధాకిషన్, పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాష్,ఉప తహశీల్దార్ ప్రవీణ్ కుమార్,తదితరులు ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Siricilla, Telangana