Haribabu, News18, Rajanna Sircilla
ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. డిజిటల్ సంతకాల (Digital signature) ద్వారా ఇప్పటికే పలు పత్రాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్ (CM KCR) తెలంగాణ ప్రభుత్వం తాజాగా పంచాయతీల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో డిజిటల్ కీ ప్రక్రియను తీసుకురానుంది. మరో 7 రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామ పంచాయతీల కార్యదర్శులకు డిజిటల్ కీ (digital key) అమలు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. దీంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు వేగంగానూ, పారదర్శకంగానూ అందించే వీలు కలుగనుంది. జిల్లాలో ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో ఈ పంచాయతీ ద్వారా డిజిటల్ విధానాన్ని అమలు చేస్తోంది.
ప్రస్తుతం ఆన్లైన్ చేసిన తర్వాత మళ్లీ కార్యదర్శులు సంతకాలు చేసి అందించే ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో కొంత జాప్యం చోటు చేసుకుంటోంది. డిజిటల్-కీ విధానం అందుబాటులోకి రానుండడంతో నేరుగా డిజిటల్ సంతకాలతోనే ధ్రువీకరణ పత్రాలు పొందే వీలు ఉంటుంది. ముఖ్యంగా గ్రామాల్లో జనన, మరణ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. డిజిటల్ కీ ద్వారా.. వేగంగా పత్రాలు పొందవచ్చు. పారదర్శకంగా, అక్రమాలు జరగకుండా వేగంగా పత్రాలు పొందవచ్చు. మీ సేవ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలు ఎక్కడైనా తీసుకునే వీలుంటుంది. మేసేజ్ ద్వారా దరఖాస్తుదారుడికి వివరాలు అందనున్నాయి. దీని ద్వారా గ్రామ పంచాయతీల్లో రికార్డులు కూడా జాప్యం చేయకుండా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో ఉపాధిహామీ పథకం, రికార్డుల నిర్వహణ, హరితహారం.. ఇంటి పన్నుల వసూళ్లు, ఇతర అభివృద్ధి పనులు పర్యవేక్షించే క్రమంలో పత్రాల జారీలో కొంత జాప్యం కనిపిస్తోంది. డిజిటల్-కీ విధానం ద్వారా ఆ జాప్యం తోలగనుందని తెలుస్తోంది.
గ్రామ పంచాయతీల్లో అమలు..!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాల్లో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో వెయ్యి లోపున ఉన్న గ్రామ పంచాయతీలు 100, వెయ్యి నుంచి 5 వేల వరకు 148 పంచాయతీలు, 5 వేల పైన ఉన్నవి. 7 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 255 గ్రామ పంచాయతీలకు తోడుగా 17 అనుబంధ గ్రామాలు కూడా ఉన్నాయి. డిజిటల్-కీ విధానం వినియోగదారులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు ఉపయోగంగా మారనుందనే చెప్పాలి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పంచాయతీ కార్య దర్శులకు మరో వారం రోజుల్లో డిజిటల్ కీ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వేగంగా అందుకునేందుకు వీలు కలుగుతుంది. పత్రాలు జారీ చేయడంలో పారదర్శకత పెరుగుతుంది. జాప్యం తగ్గుతుంది అని రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Siricilla, Telangana