(K.Haribabu,News18, Rajanna siricilla)
రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna siricilla)వేములవాడ గ్రామీణ మండలంలోని ఫాజుల్ నగర్ వద్ద ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని సాగుకోసం వినియోగంచుకోవాలన్న రైతన్నల ఆశలు అడియాశలవుతున్నాయి. ప్రాజెక్టు నీటిపై ఆధారపడ్డ రైతన్నల పంటలు ఎండిపోతున్నాయి. పొట్టదశలో ఉన్న పంటలకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్లంపల్లి నుంచి గంగాధర, కొడిమ్యాల మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ చేరుకునే ఈ నీరు వేములవాడ(Vemulawada),రుద్రంగి(Rudrangi),చందుర్తి (Chandurthi),జోగాపూర్ (Jogapur)పంప్ హౌజ్ వరకు వెళ్తోంది. రెండు పంటలు సాగు చేసుకునే రైతులకు ఈ యేడాది సకాలంలో నీరందక ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పంటల సాగుకు నీరందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. దీంతో వేల ఎకరాలు బీడుగా మారుతున్నాయి.
సాగు నీటికి కటకట..
వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట, చందుర్థి, రుద్రంగి, వేములవాడ రూరల్ మండల కేంద్రాల్లో సైతం బోరు బావుల్లో నీటిమట్టం అధికంగా తగ్గడంతో పంట పొలాలకు నీరందక రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నీటి కాలువల ద్వారా మీరు అందించి పచ్చని పంట పొలాలను కాపాడి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు సైతం కోరుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్న తరుణంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడంతో రైతులు ఇకముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని భయాందోళన చెందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు, మంత్రి కేటీఆర్ క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. ఎన్నో ఆశలతో పంటలను సాగు చేసిన రైతులకు నిరాశ మిగులుతుందని వారు చెబుతున్నారు.
ఎండిపోతున్న పంటలు..
ఎల్లంపల్లి నీటిపై ఆధారపడి వరిపంట సాగుచేశామని.. ఇప్పుడు పంట పొట్టదశలో ఉండగా.. బావుల్లో, బోరుల్లోనినీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని ఫాజుల్ నగర్ రైతు చంద్రయ్య చెబుతున్నాడు. ప్రాజెక్టు నీరందకపోతే పెట్టుబడి సైతం రాని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశాడు. రోజు రోజుకీ పెరుగుతున్న అధిక ఎండలతో పచ్చని పంట పొలాలు బీడుగా మారుతున్నాయని రైతు లక్ష్మి రాజ్యం పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎల్లంపల్లి నీటిని విడుదల చేయాలని కోరారు. దీనిపై ఈఈ సంతు ప్రకాష్ రావును వివరణ కోరగా మేడారం పంప్ హౌజ్ వద్ద మరమ్మతులు జరుగుతున్నాయనితెలిపారు. మరమ్మతు పనులు పూర్తికాగానే పంట పొలాల సాగుకు నీటిని విడుదల చేస్తామని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers, Karimangar, Local News, Telangana News