Haribabu, News18, Rajanna Sircilla
రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ప్రగతిలో ఉన్న పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో రహదారులు, భవనాల శాఖఅధికారులతో సమీక్ష నిర్వహించి, పెండింగ్ లో ఉన్న పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు.సిరిసిల్లలో రగుడు నుండి ఎల్లమ్మ జంక్షన్ వరకు నాలుగు వరుసల బైపాస్ రహదారి విస్తరణ పనులు, రగుడు నుండి వెంకటాపూర్ నిర్మిస్తున్న బైపాస్ రహదారుల తుది దశ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఫిబ్రవరి మొదటి వారంలోగా ఈ పనులు పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేసి, ఆ దిశగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
రగుడు నుండి వేములవాడ నంది కమాన్ వరకు ఉన్న రహదారిపై ఎక్కడైనా గుంతలు ఉంటే పూడ్చి, మరో లేయర్ బీటీ వేయాలని ఆదేశించారు. రగుడు జంక్షన్ లో స్పీడ్ బ్రేకర్లతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. వేములవాడ నంది కమాన్ నుండి కరీంనగర్ వెళ్ళే దారి విస్తరణ పనులను చేపట్టాలన్నారు. మహాశివరాత్రి నేపథ్యంలో వేములవాడకు వచ్చే అప్రోచ్ రోడ్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వేములవాడ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, సినారె భవనం, స్టేడియం నిర్మాణాలకు టెండరింగ్ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సూచించారు.
ఇప్పటికే మంజూరైన బీటీ రెన్యూవల్ పనులు ఇంకా కూడా ఎందుకు ప్రారంభం కాలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించి, గడువు వివరాలతో కూడిన పూర్తి నివేదిక తనకు సమర్పించాలని కలెక్టర్ అన్నారు.
రగుడు, శాంతి నగర్ తో పాటు ఆయా గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమీక్షలో ఇంఛార్జి డీఆర్ఓ టి.శ్రీనివాస రావు, ఆర్ & బిఈఈ శ్యామ్ సుందర్, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య, సెస్ ఎండీ రామకృష్ణ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Siricilla, Telangana