పెళ్లింట విషాదం నెలకొంది. కూతురి పెళ్లికి సరిగ్గా రెండు రోజుల ముందు ఆమె తండ్రి మరణించాడు. అది కూడా చెత్త విషయంలో పొరుగింటి వ్యక్తితో గొడవపడి.. ప్రాణాలు కోల్పోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla) వేములవాడ (Vemulavada)లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. వేములవాడకు చెందిన హన్మంతు కూతురు వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 10న పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కార్యక్రమాల్లో అందరూ బిజీగా ఉన్నారు. సాధారణంగా పెళ్లి ఇంట చెత్త ఎక్కువగా పోగవుతుంటుంది. అలాటే హన్మంతు ఇంట్లోనూ చెత్త ఎక్కువగా పోగయింది. ఐతే దానిని తన ఇంటి ముందు ఉండే ఖాళీ ప్రాంతంలో పడేశాడు. ఐతే చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా? అని పక్కింట్లో ఉండే నాగరాజు.. హన్మంతుతో గొడవపెట్టుకున్నాడు.
నాగరాజు, హన్మంతు మధ్య మాటా మాటా పెరిగింది. ఇరు కుటుంబాల వారు సర్దిచెప్పినా వినలేదు. ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలోనే నాగరాజు గట్టిగా నెట్టివేయగా.. హన్మంతు కుప్పకూలిపోయాడు. ఎంత పిలిచినా పలకలేదు. తట్టి లేపినా.. స్పందన లేదు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించాడని డాక్టర్లు చెప్పారు.
ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురి పెళ్లికి రెండు రోజుల ముందు తండ్రి చనిపోవడంతో .. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Local News, Rajanna sircilla