రిపోర్టర్ : హరి
లొకేషన్ : రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల బీజేపీ నేతలు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. డిగ్రీ కళాశాల వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి డిప్యూటీ సీఎం, ఉన్నత విద్యా శాఖ మంత్రి హామీ ఇచ్చి మరిచారని వారికి గుర్తు చేసేందుకే ఈ నిరాహార దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిరాహార దీక్షకు బీజేపీ రాజన్న సిరిసిల్లజిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమా, మాజీ జెడ్పిటిసి అన్నపూర్ణలు సంఘీభావం తెలిపారు.
ఆడపిల్లలకు ఉన్నత విద్య దూరమవుతుందని మాజీ జడ్పీ చైర్ పర్సన్ తులా ఉమా అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇది కొత్త కోరిక కాదని గతంలో అధికార పార్టీ వారు ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని మేము కోరుతున్నామని వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు.
వేములవాడ నియోజకవర్గంపై మంత్రి కేటీఆర్ చిన్న చూపు ఎందుకని మాజీ జెడ్పిటిసి పల్లం అన్నపూర్ణ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో అన్ని రకాల వసతులతో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, కానీ వేములవాడ నియోజకవర్గంలో అయితే పాఠశాలల దుస్థితి మరింత దారుణంగా ఉందని అన్నారు. గతంలో మంత్రి కేటీఆర్ వేములల్లో పర్యటించిన నేపథ్యంలో వేములవాడ సిరిసిల్ల నాకు రెండు కండ్లు అంటూ చెప్పిన మాటలను వారు గుర్తు చేస్తూ మండిపడ్డారు. ఇప్పటికైనా మంత్రి వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిపై శ్రద్ధ వహించాలని డిమాండ్ చేశారు.
మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలోనే ఇచ్చిన హామీలు నెరవేరడం లేదంటే పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని రాజన్న సిరిసిల్లబీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మండల కేంద్రానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అందిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో మరింత కార్యాచరణతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరింత దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna film, Telangana