(K.Haribabu,News18, Rajanna siricilla)
వ్యవసాయం (Agriculture)..! జీవ పరిణామ క్రమంలో మనిషి మస్తిష్కంలో నుంచి మొదటగా వచ్చిన ఓ అద్భుతమైన ఆలోచన (Idea). మానవ నాగరికతకు మొదటి మెట్టుగా చెప్పుకోనే వ్యవసాయం.. ఒకరకంగా మనిషికి ప్రకృతి ప్రసాదించిన వరం. దుక్కి దున్ని, విత్తు నాటి, పంట పండించే వరకు అన్నీ విషయాల్లోనూ రైతుకు ప్రకృతి సహకరిస్తుంది. సమయాన్ని బట్టి ప్రకృతిలో జరిగే వాతావరణ మార్పులు రైతుకు, చేనుకు ఎంతో మేలు జరుగుతుంది. వ్యవసాయంలో పంటను నాశనం చేసే చీడపీడలు, కీటకాలే కాదు, రైతుకు అన్నుగా నిలిచే పురుగులు కూడా ఉంటాయి. అటువంటి వాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది ఆరుద్ర పురుగుల (Arudra worms) గురించే.
ఏమిటీ ఆరుద్ర పురుగులు:
భూమిపైన అనేక రకాల పురుగుల జాతులు ఉన్నాయి. వీటిలో కొన్ని మనిషికి హాని చేసేవి కొన్నైతే, సహాయం చేసేవి కొన్ని. ఈ ఆరుద్ర పురుగులు రెండో రకానికి చెందినవి. ముఖ్యంగా రైతులకు ఈ ఆరుద్ర పురుగులు (Arudra worms) ఎంతో మేలు చేస్తాయి. 'ఆరుద్ర కార్తె' (జూన్ మొదటి వారం) రాగానే రైతులు వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. తొలకరి జల్లులు కురవడంతో వాతావరణం చల్లబడి పొలాల్లో ఆరుద్ర పురుగులు కనిపిస్తాయి. వీటిని కుంకుమ పురుగులు, చందమామ పురుగులు అని కూడా అంటారు. వీటిని ఇంగ్లీష్‌లో రెయిన్ బగ్స్ (Rain bugs), రెడ్ వెల్వెట్ మైట్స్ అని అంటారు. ఇవి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పొలాలలో కనిపిస్తాయి. ఇవి పంటలకు ఎటువంటి హాని చేయవు. వీటిని చూడడాన్ని రైతులు శుభ సూచకంగా భావిస్తారు. పొలాల్లో ఈ ఆరుద్ర పురుగులను చూడడం వల్ల ఏడాదంతా మంచి జరుగుతుందని పూర్వం రైతులు భావించే వారు. వర్షాకాలాన్ని సూచిస్తూ గుట్టలుగుట్టలుగా ఈ ఆరుద్ర పురుగులు పొలాల్లో కనిపించేవి.
కనుమరుగవుతున్న ఆరుద్ర పురుగులు..
రైతు వ్యవసాయం ప్రారంభించిన నాటి నుంచి పంట కోసేవరకు ఆరుద్ర పురుగులు పొలాల్లో సంచరిస్తూనే ఉంటాయి. వీటి వల్ల పంటకు ఎటువంటి హాని ఉండదు సరికదా, మొక్కలు, ఆకులపై ఇతర కీటకాలు, చీడపీడలు పెట్టె గుడ్లను, సూక్ష్మ క్రిములను చంపి తిని పంటకు లబ్ది చేకూరుస్తాయి ఈ ఆరుద్ర పురుగులు. ఆ విధంగా ఇవి పంటకు, రైతుకు మొదటి నేస్తాలుగా చెప్పుకోవచ్చు. అయితే రైతుకు (Farmer) ఇంత చేస్తున్న ఈ ఆరుద్ర పురుగులను ఆ రైతే చంపుకునే పరిస్థితి కనిపిస్తుంది. నేటి వ్యవసాయ విధానంలో అధిక దిగుబడుల కోసం రైతులు అనేక రకాల పురుగు మందు రసాయనాలను (పెస్టిసైడ్స్)వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరుద్ర పురుగులకు అవి శాపంగా మారి అంతరించిపోతున్నాయి. వ్యవసాయంలో అధిక మొత్తంలో రైతులు పెస్టిసైడ్స్ (Pesticides) వినియోగించడంతో ఆరుద్ర పురుగులు తట్టుకోలేక పోతున్నాయి. పూర్వకాలంలో ఈ పురుగుల సంఖ్య ఎక్కువగా ఉండేవి. కానీ ప్రస్తుత కాలంలో ఇవి అంతరించే దశకు చేరుకున్నట్లు వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
ఆరుద్ర పురుగుల గురించి కొంత సమాచారం..
ఈ పురుగులంటే పరమశివుడికి ఎంతో ఇష్టమని చాలా మంది భావిస్తారు. పరమశివుడి మరో పేరైన 'రుద్ర' అవతారంగా ఈ పురుగులను భావిస్తారు. కొన్ని ప్రాంతాలలో వీటిని లక్ష్మీ దేవిగా భావించి పూజిస్తుంటారు కూడా. ఈ ఆరుద్ర పురుగులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఆరుద్ర పురుగులు కనుమరుగవడంపై రాజన్నసిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla) వేములవాడ నియోజకవర్గం పరిధిలోని రుద్రంగి గ్రామానికి చెందిన రైతు గణేష్ మాట్లాడుతూ.. ఆరుద్ర కార్తె వచ్చిందంటే ఎక్కడ చూసినా గుంపులుగా ఆరుద్ర పురుగులు కనిపించేవని, ప్రస్తుత వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు వచ్చి, రసాయన ఎరువుల వాడకం అధికమవ్వడంతో ఆరుద్ర పురుగులు నశించిపోతున్నాయని పేర్కొన్నారు. పూర్వకాలం పంట పొలాల్లో ఆరుద్ర పురుగు కనిపిస్తే శుభసూచకంగా భావించి వ్యవసాయ పనులు ప్రారంభించే వాళ్లమని రైతు గణేష్ వివరించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculuture, Farmer, Local News, Organic Farming, Siricilla