Home /News /telangana /

RAJANNA SIRCILLA A DISUSED BRIDGE BETWEEN TANGALLAPALLY LAKSHMIPUR IN RAJANNA SIRCILLA DISTRICT

Rajanna Sircilla: రూ. కోటితో నిర్మించిన వంతెనతో ఆ గ్రామాల ప్రజలకు లేనిపోని కష్టాలు...

రూ. కోటితో నిర్మించిన వంతెనతో ఆ గ్రామాల ప్రజలకు లేనిపోని కష్టాలు

రూ. కోటితో నిర్మించిన వంతెనతో ఆ గ్రామాల ప్రజలకు లేనిపోని కష్టాలు

ప్రజల సౌకర్యార్ధం ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుంది. కానీ చక్కని ప్రణాళిక లేకపోతే ఆ అభివృద్ధి పనులే ప్రజలకు కష్టాలు తెస్తాయని ఈ కధనం ద్వారా తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా లక్ష్మీపూర్ - తంగళ్లపల్లి మధ్యగల సండ్రవాగుపై వంతెనతో ప్రజలకు ఇబ్బందులు

ఇంకా చదవండి ...
    (K.Hari babu, News 18, Rajanna sircilla)

    ప్రజల సౌకర్యార్ధం ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుంది. కానీ చక్కని ప్రణాళిక లేకపోతే ఆ అభివృద్ధి పనులే ప్రజలకు కష్టాలు తెస్తాయని ఈ కధనం ద్వారా తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా లక్ష్మీపూర్ - తంగళ్లపల్లి మధ్యగల సండ్ర  వాగుపై ప్రభుత్వం వంతెన నిర్మించింది.  వరదల సమయంలో ఆయా గ్రామాల ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రూ.1 కోటి వ్యయంతో ప్రభుత్వం ఈ వంతెన నిర్మించింది. అదే సమయంలో వంతెన నిర్మించిన ప్రదేశంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉండగా ప్రస్తుతం అవి కిందకు వేలాడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.

    రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో తంగళ్ళపల్లి మండలంలోని లక్ష్మీపూర్, చీర్లవంచ, చింతలాఠాణా గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు సండ్ర వాగుపై రూ. 1 కోటి నిధులతో వంతెన నిర్మించారు. వర్షాకాలంలో లక్ష్మీపూర్ - తంగళ్లపల్లి మధ్య సండ్ర వాగు పొంగి ఈ గ్రామాలకు రాకపోకలు ఆగి పోతుంటాయి. ప్రజల కష్టాలు తీర్చాలని ప్రభుత్వం సండ్రవాగుపై బ్రిడ్జి నిర్మించింది. వంతెన నిర్మాణం పూర్తైనా ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. వంతెన పై నుంచి ఎన్పీడీసీఎల్ హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉండటంతో వంతెన ప్రారంభించేందుకు ఆలస్యమవుతుంది. ఆ వంతెనపై నుంచి వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఎంతో వ్యయంతో నిర్మించిన వంతెన నిరుపయోగంగా మారడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

    హైటెన్షన్ విద్యుత్ లైన్ మార్చని ఎన్పీడీసీఎల్:
    లక్ష్మీపూర్ సండ్ర వాగుపై నిర్మించిన వంతెనపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ లైన్, ఎన్పీడీసీఎల్ పరిధిలోకి రావడంతో తొలగించడం కష్టమవుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ అధికారులు చెబుతున్నారు. సెస్ పరిధిలో ఉంటే ఎప్పుడో ఈ సమస్యను పరిష్కరించే వారమని అధికారులు అంటున్నారు. కోటి రూపాయల నిధులతో నిర్మించిన వంతెన నిరుపయోగంగా మారడం పట్ల వాహనదారులు, స్థానిక గ్రామాల ప్రజలు ఎన్పీడీసీఎల్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఎన్పీడీసీఎల్ అధికారులు మాత్రం ఇవేమి తమ దృష్టికి రాలేదన్నట్టుగా వ్యవరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఒక్కరోజులో ఎన్పీడీసీఎల్ అధికారులు బ్రిడ్జిపై ప్రమాదకరంగా ఉన్న హై టెన్షన్ విద్యుత్ తీగలను తొలగిస్తారని స్థానికులు వాపోతున్నారు.

    సంబంధిత అధికారులకు తెలియజేశాం: ఎంపీడీవో పి.లచ్చాలు
    సండ్ర వాగుపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ వైర్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేశామని తంగళ్ళపల్లి ఎంపీడీవో పి.లచ్చాలు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా ఎన్పీడీసీఎల్ అధికారులను సంప్రదించి పలు సూచనలు చేశారని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు ఎంపీడీఓ అన్నారు. సండ్రవాగుపై వంతెన నిర్మాణం పూర్తైనా, హైటెన్షన్ విద్యుత్ తీగల కారణంగా వంతెన దాటాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించి వంతెనను వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Issue, Local News, Sircilla, Telangana

    తదుపరి వార్తలు