news18-telugu
Updated: October 19, 2020, 3:54 PM IST
ప్రతీకాత్మకచిత్రం
Hyderabad Rains: హైదరాబాద్ నగరంపై వరుణుడు కక్ష కట్టాడు. ఇప్పడిప్పుడే ముంపు ప్రాంతాల్లో జనం ఇళ్లకు తరలుతున్న వేళ మరోసారి సోమవారం మధ్యాహ్నం నుంచి నగరంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా చాంద్రాయణ గుట్ట, సంతోష్‌నగర్, బాలాపూర్, అబిడ్స్, అఫ్జల్‌గంజ్, కోఠి, ఎంజే మార్కెట్, పురాణాపూల్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, తార్నాక, మల్కాజ్గిరి, నేరేడ్మెట్లో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే నగరంలో సుమారు 200 కాలనీలు వరదముంపులో ఉన్నాయి. జనం ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లోనూ, ఇంటి పైకప్పు మీద నివాసం ఉంటున్నారు. అయితే ఈ వరద కష్టాల నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ భారీ వర్షం మొదలు కావడంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అవసరం ఉంటే తప్ప బయటికి రావొద్దని సూచించారు. అపార్ట్మెంట్లలో సెల్లార్లు, విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే తెలంగాణకు మరోసారి భారీ వర్షం పొంచి ఉంది. మధ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు చాలా చోట్ల, రేపు మరియు ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Published by:
Krishna Adithya
First published:
October 19, 2020, 3:54 PM IST