news18-telugu
Updated: August 16, 2020, 4:13 PM IST
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం రెడ్ అలర్ట్ జారీచేసింది. ఐంఎండీ బులెటిన్ ప్రకారం.. భారీ వర్షం ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వస్తుంది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలుతాయి. రోడ్లు తెగిపోయి వాహనాల రాకపోకలకు కొన్ని గంటల నుంచి కొన్ని రోజులు పాటు అంతరాయం కలగవచ్చు. రిజర్వాయర్లు ఓవర్ ఫ్లో కావచ్చు. నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగుతాయి. పంట పొలాలను నీట మునుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపథ్యంలో రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించాలని అధికార యంత్రానికి సూచించింది. అన్ని జిల్లాల ప్రజలను అప్రమత్తం చేయాలని.. వరద నీటితో అంటు వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాలు:ఆదిలాబాద్, కుమ్రం భీమ్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించంది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఐఎండీ వెదర్ బులెటిన్
Published by:
Shiva Kumar Addula
First published:
August 16, 2020, 4:13 PM IST