నేపాల్ బుడ్డోడు.. స్వదేశానికి పయనమయ్యాడు.. రైల్వే సిబ్బంది సేవలకు ఆ తల్లి ఫిదా..

తల్లీ బిడ్డను లక్నోకు పంపిస్తున్న రైల్వే సిబ్బంది

ఈనెల 21న బెంగళూరు నుంచి లక్నో వెళ్తున్న నేపాల్‌ వాసి అనితాదేవికి యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో పురిటినొప్పులు రావడంతో తక్షణం స్పందించిన రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌  అధికారులు ఖమ్మంలో స్టాప్‌ లేకపోయినా రిక్టెస్ట్ చేసి మరీ నిలిపారు.

 • News18
 • Last Updated :
 • Share this:
  ఖమ్మంలో పుట్టిన నేపాల్‌ బుడతడు స్వదేశానికి బయలుదేరాడు. నవజాత శిశువుతో పాటు తల్లి అనితాదేవి, ఇంకా ఇతర బంధువులకు ఇక్కడి అధికారులు ప్రయాణ ఏర్పాట్లు చేశారు. వారికి ప్రయాణంలో అవసరమైన తినుబండారాలు, ఇతర ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని అరేంజ్‌ చేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో తల్లీబిడ్డలు స్వదేశానికి ప్రయాణంకావడం వెనుక రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ పోలీసు, రెవెన్యూ, వైద్యారోగ్య అధికారుల కృషి ఎంతో ఉందని.. వారికి అందరికీ చేతులెత్తి నమస్కారం తెలుపుతున్నట్టు అనితాదేవి తెలిపారు.

  ఈనెల 21న బెంగళూరు నుంచి లక్నో వెళ్తున్న నేపాల్‌ వాసి అనితాదేవికి యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో పురిటినొప్పులు రావడంతో తక్షణం స్పందించిన రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌  అధికారులు ఖమ్మంలో స్టాప్‌ లేకపోయినా రిక్టెస్ట్ చేసి మరీ నిలిపారు. 108 అంబులెన్స్‌ ఏర్పాటు చేసి.. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెను చేర్చారు. అక్కడ ఆమెకు తెల్లవారుజామున వైద్యాధికారులు సాధారణ కాన్పు చేశారు. అనంతరం ఆమెకు కేసీఆర్‌ కిట్‌ను అందజేసి.. డిశ్చార్జి అయ్యేదాకా ఆమెతో బాటు, తోడుగా ఉన్న బంధువులకు కావాల్సిన వసతి, భోజన ఏర్పాట్లను చేశారు.

  అనితా దేవిని రైలు ఎక్కిస్తున్న రైల్వే సిబ్బంది..


  ఆమె పూర్తి స్థాయిలో కోలుకోవడంతో లక్నో వెళ్లడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నాగర్‌కోయిల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆమెకు రిజర్వేషన్‌ చేయించి లక్నోకు పంపారు. మధ్యలో ప్రయాణ సమయంలో అవసరమైన తినుబండారాలు, ఇంకా కొంత నగదును అందజేశారు. అనితాదేవి భర్త గతంలో బెంగళూరులో పనిచేస్తూ దుబాయ్‌లో ఉద్యోగం దొరకడంతో అక్కడికి వెళ్లిపోయాడు. దీంతో బంధువులు తోడుగా లక్నోకు వెళ్తున్న అనితాదేవికి రైలు ప్రయాణంలోనే పురిటినొప్పులురావడంతో కంగారు పడ్డారు. అయితే స్పందించిన రైల్వే అధికారులు ఆమెకు అన్నివిధాలా సాయంగా నిలవడంతో ఆమె, పుట్టిన బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో స్వస్థలానికి ప్రయాణం అయ్యారు.

  కొన్నాళ్లు లక్నోలో ఉన్న బందువుల వద్ద ఉండి.. అనంతరం ఖాట్మండు దగ్గరిలోని తమ స్వగ్రామానికి వెళ్లనున్నట్టు ఆమె తెలిపారు. ఆమెకు సఖి బృందం, చైల్డ్‌లైన్‌ స్టాఫ్‌ అందరూ రైల్వే స్టేషన్‌ దాకా వచ్చి వీడ్కోలు చెప్పారు. నిండు గర్భిణికి అన్ని విధాలా సాయంగా ఉండి.. అండగా నిలిచిన రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఇన్సెక్టర్‌ మధుసూదన్‌ను ఆ శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్‌ కర్ణన్‌ అభినందించారు.
  Published by:Srinivas Munigala
  First published: