Home /News /telangana /

RAHUL GANDHI MAY COME TO WARANGAL MEETING OF CONGRESS ON SEPTEMBER 17 HERE IS THE DETAILS AK

Telangana Congress: తెలంగాణకు రాహుల్ గాంధీ... ఆ రోజే ఉండేలా టీపీసీసీ ప్లాన్ ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rahul Gandhi: రాహుల్ గాంధీ వీలును బట్టి తేదీ మారే అవకాశం ఉంటుందని.. అయితే సాధ్యమైనంతవరకు అదే రోజు సభ ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ యోచిస్తోంది.

  తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో దళిత, గిరిజన దండోరా సభలను నిర్వహించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే ఇంద్రవెల్లి, రావిర్యాలలో సభలను పెద్ద ఎత్తున నిర్వహించింది. ప్రతి వారం, పది రోజులకు ఒకసారి ఈ తరహా సభను నిర్వహించాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ.. వచ్చే నెలలో వరంగల్‌లో నిర్వహించ తలపెట్టిన ఈ తరహా సభకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన రాహుల్ గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమాచారం ఇవ్వడం.. ఆయన ఓకే చెప్పడం కూడా జరిగిపోయిందని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్ 17న వరంగల్‌లో దళిత, గిరిజన దండోరా సభను నిర్వహించి.. అక్కడకు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని తెలంగాణ కాంగ్రెస్ యోచిస్తోంది.

  రాహుల్ గాంధీ వీలును బట్టి తేదీ మారే అవకాశం ఉంటుందని.. అయితే సాధ్యమైనంతవరకు అదే రోజు సభ ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ యోచిస్తోంది. ఆ రోజు తెలంగాణకు ప్రత్యేకమైనది కావడంతో.. అదే రోజు సభ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. తెలంగాణవ్యాప్తంగా ఈ తరహా సభల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కాంగ్రెస్ అధిష్టానం.. ఏదో ఒక సభకు రాహుల్ వస్తారని ముందుగానే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి తెలిపింది. అయితే వచ్చే నెల 17న వరంగల్‌లో జరిగే సభకు రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందని.. ఆ దిశగా రాహుల్ గాంధీ షెడ్యూల్ ఉండేలా చూడాలని తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీని కోరినట్టు తెలుస్తోంది.

  తెలంగాణకు రాహుల్ గాంధీకి వస్తే పార్టీకి కొత్త ఊపు వస్తుందని పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఏదైనా ప్రకటన చేస్తే.. టీఆర్ఎస్‌తో పాటు బీజేపీకి కూడా గట్టి కౌంటర్ ఇచ్చినట్టు అవుతుందని భావిస్తున్నారు. మొత్తానికి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఏదో రకంగా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తుంటే.. అందుకు కౌంటర్‌గా రాహుల్ గాంధీని రంగంలోకి దించి దళిత గిరిజన సభను పెద్ద ఎత్తున నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Rahul Gandhi, Telangana

  తదుపరి వార్తలు