హోమ్ /వార్తలు /తెలంగాణ /

Teenmar Mallanna: జైలు నుంచి విడుదలైన తీన్మార్ మల్లన్న.. 74 రోజుల తర్వాత బయటకు..

Teenmar Mallanna: జైలు నుంచి విడుదలైన తీన్మార్ మల్లన్న.. 74 రోజుల తర్వాత బయటకు..

తీన్మార్ మల్లన్న(ఫైల్ ఫోటో)

తీన్మార్ మల్లన్న(ఫైల్ ఫోటో)

Teenmar mallanna: తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదయ్యాయి. అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసుల్లో 31 కేసులకు ఇది వరకే బెయిల్ మంజూరైంది. అయితే పెండింగ్‌లో ఉన్న మరో కేసులో తాజాగా హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో.. ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.

ఇంకా చదవండి ...

  క్యూ న్యూస్ (Q news) అధినేత చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) జైలు నుంచి విడుదలయ్యారు. 74 రోజుల తర్వాత ఆయనకు బయటకు వచ్చారు. సోమవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ఓ జ్యోతి‌ష్యు‌డిని బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్నను ఆగస్టులో చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. సీఎం కేసీఆర్‌ను అసభ్య పదజాలంతో దూషించారన్న కేసులోనూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలా తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదయ్యాయి. అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసుల్లో 31 కేసులకు ఇది వరకే బెయిల్ మంజూరైంది. అయితే పెండింగ్‌లో ఉన్న మరో కేసులో తాజాగా హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో.. ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.


  చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన తీన్మార్ మల్లన్నకు ఆయన అనుచరులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. ''ఎవరికి చిన్న ఇబ్బంది కలిగినా నేను ముందుండి కొట్లాడతా. యుద్ధం మిగిలే ఉంది. అందరం కలిసి యుద్ధంలో కలిసి పాల్గొనబోతున్నాం. కోర్టు షరతలులు ముగిసిన తర్వాత ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తా. రవ్వంత కూడా వెనక్కి తగ్గేది లేదు. కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయను. ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటా. జైలులో జరిగిన భయంకరమైన విషయాలను త్వరలోనే బయటపెడతా.'' అని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.

  ఈటల రాజేందర్‌పై కేసీఆర్ సరికొత్త ప్లాన్ ?.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

  కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు పోలీస్‌స్టేష‌న్ల‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ వంటి ఆరోపణల కింద కేసులు న‌మోదయ్యాయి. ఐతే దీని వెనక ప్రభుత్వం కుట్ర ఉందని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నందునే ఆయనపై కేసీఆర్ సర్కార్ కక్ష గట్టిందని మండిపడుతున్నారు. వరుసగా ఆయనపై కేసులు నమోదవడం.. ఒకదాంట్లో బెయిల్ రాగానే, మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేయడంతో.. రెండు నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల తర్వాత తీన్మార్ మల్లన్న పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగిపోయింది. టీఆర్ఎస్ అభ్య‌ర్థి ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డికి ఆయన గట్టిపోటీ ఇచ్చారు. ఆ తర్వాత రాజ‌కీయంగా ఎదిగే క్ర‌మంలో పాద‌యాత్ర‌కు కూడ శ్రీకారం చుట్టారు తీన్మార్ మల్లన. కానీ ఆలోపే జైలుకెళ్లాల్సి వచ్చింది.

  Telangana: దళితబంధు, ఉద్యోగ నోటిఫికేషన్లు.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

  తీన్మార్ మల్లన్న జైల్లో ఉన్న సమయంలో ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి క్యూ న్యూస్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీలో చేరబోతున్నారని ప్రకటించింది. తీన్మార్ మల్లన్న సోషల్ మీడియా ఖాతాల్లోనూ 'జై బీజేపీ' అని పేర్కొనడం అప్పట్లో హట్ టాపిక్‌గా మారింది. మల్లన్న బీజేపీలో చేరతారన్న విషయాన్ని ఎంపీ అరవింద్ కూడా ధృవీకరించారు. ఆయన ఫ్యామిలీకి బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. ఐతే తీన్మార్ నిర్ణయాన్ని కొందరు అనుచరులు వ్యతిరేకించగా.. మరికొందరు మాత్రం స్వాగతించారు.

  ఈటల రాజేందర్‌కు బీజేపీలో ఈ కీలకమైన పదవి.. ఆయన కోరుకున్నదే..?

  ఇక మల్లన్నపై నమోదైన కేసుల గురించి.. ఇటీవల ఆయన భార్య హోంమంత్రి అమిత్‌ షాను కూడా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు బనాయిస్తోందని ఫిర్యాదు చేశారు. మల్లన్నపై నమోదైన కేసులపై జాతీయ బీసీ కమిషన్ కూడా గ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల క్రమంలోనే హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Hyderabad, Teenmar mallanna, Telangana, Telangana Politics

  ఉత్తమ కథలు