Putta Madhu: లాయర్ దంపతుల హత్య కేసు.. నేను ఎక్కడికీ పారిపోలేదు.. మీడియాపై పుట్ట మధు ఫైర్

పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో లాయర్ వామనరావు దంపతులు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

  • Share this:
    పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో లాయర్ వామనరావు దంపతులు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నిందితులు ఏ1- కుంట శ్రీను, ఏ2- చిరంజీవి, ఏ3- అక్కపాక కుమార్‌లకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు నిందితులకు కారు, ఆయుధాలు సమకూర్చారరనే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ హత్య వెనక జెడ్పీ చైర్మన్ పుట్ట మధు హస్తం ఉందని లాయర్ వామనరావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతల పలుకుబడితోనే ఈ హత్య జరిగిందని వారు అంటున్నారు. ఇక, పుట్ట మధుకు, ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు దాఖలు చేయడంతోనే ఇలా జరిగిందనే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే లాయర్ వామనరావు దంపతుల హత్య విషయంపై స్పందించారు.

    శనివారం మంథని మండలం ముత్తారంలో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్న పుట్ట మధు.. తనపై జరుగుతున్న ప్రచారంపై మండిపడ్డారు. కొన్ని టీవీ చానల్స్, పేపర్స్ కావాలనే తన కుటుంబంపై అదేపనిగా వార్తలు రాస్తున్నాయని విమర్శించారు. కొన్ని మీడియా చానెల్స్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు అమ్ముడిపోయి.. తనపై లేనిపోని వార్తలు రాస్తున్నాయని ఆరోపించారు. మీడియాను కొనే అంత డబ్బులు తన వద్ద లేవని.. తాను ఒక గరీబ్ అని చెప్పుకొచ్చారు. శ్రీధర్‌బాబు ఎంతపెట్టి మీడియా వాళ్లను కొన్నాడో తెలపాలని ప్రశ్నించారు. నిజ నిజాలేంటో హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి చెబుతానని అన్నారు.

    వామనరావు దంపతుల హత్య విషయంలో శ్రీధర్‌బాబు కావాలనే రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. తాను ఎక్కడికి పారిపోలేదని.. మంథనిలో ఉన్నానని.. ఇక్కడే ఉంటానని వ్యాఖ్యానించారు. కొంతమంది తనపై కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అందరికి త్వరలోనే గుణపాఠం చెబుతానని అన్నారు. ఈ కేసు విషయంలో చట్టం తనపని తాను చేసుకుంటూ వెళ్తుందని తెలిపారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్ తనను కలవనివ్వడం లేదని ఎదో ఎదో వార్త రాస్తున్నారని వ్యాఖ్యానించారు.
    Published by:Sumanth Kanukula
    First published: