Adilabad: ప్రాజెక్టులకు జల కళ.. ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు..

నిండుకుండలా ప్రాజెక్టు

Adilabad: గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి నదుల్లో చేరుతుండటంతో ఉధృతి పెరిగింది.

 • Share this:
  గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి నదుల్లో చేరుతుండటంతో ఉధృతి పెరిగింది. తెలంగాణ, మహారాష్ట్రను వేరుచేసిన పెన్ గంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చనాక కోరట బ్యారేజ్ గేట్లను తాకుతున్న విధంగా వరదనీరు దిగువ ప్రాంతానికి ప్రవహిస్తోంది. జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ప్రాజెక్టులో నీరు ఒక్కసారిగా పెరిగిపోతుండడంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలో ఉన్న సాత్నాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టులోకి 2200 ఇన్ ఫ్లో నమోదు అవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 285.5 ఉండగా ప్రస్తుత నీటిమట్టం  285.1 కి చేరింది. దీంతో  నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్ట్  2 గేట్లను ఎత్తి దిగువకు 2800 క్యూసెక్ ల వరద నీటిని వదిలారు. అటు ఎడతెరిపి లేని వర్షాలకు ఎగువనున్న మహారాష్ట్ర తో పాటు తాంసి,తలమడుగు మండలాల నుండి ఉమ్డం వాగు ద్వారా మత్తడివాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది.

  ప్రొజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 277.5మీటర్లు కాగా 2 గేట్లు ఎత్తి 145 టీఎంసీ ల నీటిని దిగువకు వదిలిపెట్టారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 277 మీటర్లు గా నీటిమట్టం కొనసాగిస్తున్నారు . ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ 0.57 టీఎంసీ లు కాగా జలాశయంలో ప్రస్తుతం 0.40 టీఎంసీలు ఉన్నాయని ప్రాజెక్ట్ జే.ఈ  చెంచుబాబు పేర్కొన్నారు. వరదనీరు చేరడంతో మత్తడివాగు ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. భీంపూర్ మండలంలోని అంతర్గమా, వడూర్, తాంసి కె గ్రామాల గుండా ప్రవహిస్తున్న పెన్ గంగా నది భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇదిలా ఉంటె నిర్మల్ జిల్లాలో భైంసా డివిజన్ పరిధిలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భైంసా లోని గడ్డేన్న సుద్దవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తివేసి 34వేల 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు .నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదిలిపెట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం  1183  అడుగులు  1.484 టిఎంసి కాగా, ప్రస్తుత నీటిమట్టం 1183 అడుగులు. ప్రస్తుత నీటి నిలువ  1.484 టిఎంసిలు. ఇన్ ఫ్లో  69500 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 72000 క్యూసెక్కులు  నమోదైంది.
  మొత్తం ఆరు గేట్లను తెరిచి నీటిని వదిలిపెట్టారు. జిల్లాలోని మరో ముఖ్యమైన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు 16 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదిలిపెట్టారు. అటు మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమురంభీం ప్రాజెక్టులు కూడా నిండుకుండాలా మారాయి. ఇన్ ఫ్లో పెరగడంతో అధికారులు వాటి గేట్లను పైకెత్తి వరద నీటిని దిగువ ప్రాంతాలకు వదిలిపెట్టారు. కాగా వర్షా కాలం మొదలైనప్పటి నుండి ఇంత పెద్ద వర్షాలు ఇప్పటి వరకు నమోదు కాలేదని స్థానికులు పేర్కొంటున్నారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు
  Published by:Veera Babu
  First published: