Tragedy in Adilabad: వైద్యం కోసం గర్భిణిని చేతులపై ఎత్తుకుని వాగు దాటించారు.. కుటుంబ సభ్యులు ఎంత శ్రమించిన దక్కని ప్రాణం..

గర్భిణిని వాగు దాటిస్తున్న కుటుంబ సభ్యులు

గర్భిణికి పురటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. అయితే సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో అంబులెన్స్ గ్రామంలోని రాలేని పరిస్థితి. దీంతో ఆమెను చేతులపై మోసుకెళ్లి వాగును దాటించారు.

  • Share this:
    తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక, వైద్యం అందక ప్రాణాలు కోల్పోయింది. ఆమెను బతికించడానికి కుటుంబ సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసిన లాభం లేకుండా పోయింది. వివరాలు.. గాదిగూడ మండలం కునికాస కొలాంగూడ గ్రామానికి చెందిన కొడప రాజుబాయి(22)కి రెండేళ్ల క్రితం మండలంలోని పరస్వాడ(బి) గ్రామానికి చెందిన యువకుడు భీంరావుతో వివాహమైంది. ఆమె ప్రస్తుతం 8 నెలల గర్భిణి. అయితే ఆదివారం అన్నదమ్ములు రాఖీ కట్టేందుకు.. భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. అంతేకాకుండా కాన్పు కోసం తల్లిగారి ఇంటి వద్దే ఉండాలని భావించింది.

    అయితే సాయంత్రం సమయంలో పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. అయితే సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో అంబులెన్స్ గ్రామంలోని రాలేని పరిస్థితి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కూనికాసా వాగు వరకు ఎడ్లబండిపై తరలించారు. అక్కడ చేతులపై ఎత్తుకొని జాగ్రత్తగా వాగును దాటించారు. అప్పటికే అక్కడి చేరుకున్న 108 వాహనంలో గాదిగూడ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యాధికారి లేరు. ఏఎన్‌ఎం, హెచ్‌ఈవో మాత్రమే ఉన్నారు. దీంతో ఆమెను ఝరి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు.



    అక్కడ ఆమెను పరీక్షించిన అక్కడి మెడికల్ ఆఫీసర్ పవన్.. పరిస్థితి విషమంగా ఉందని వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించాలని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు 108 వాహనంలో ఆమెను తీసుకుని ఆదిలాబాద్ రిమ్స్‌కు బయలుదేరారు. అయితే మార్గమధ్యలోనే ఆమె మరణించింది. అయితే రాజుబాయి మరణం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నిండు గర్భిణి ప్రాణం పోయిందని అంటున్నారు. ఎన్నో ఎళ్ళుగా గ్రామస్తులు వాగుపై బ్రిడ్జి, రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్న ఎలాంటి స్పందన లేదన్నారు. ఇలాంటి మరణాలు ఇంకా ఎన్ని రోజులని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం గ్రామానికి సమీపంలో ఉన్న వాగుపై వంతెన ఎర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: