తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘ మతనాలు ముగిశాయి. గులాబీ శిబిరం ఆశలు, అంచనాలను తలకిందులు చేస్తూ కేసీఆర్ కు పీకే కటీఫ్ చెప్పారు. నిజానికి పీకే హైదరాబాద్ వచ్చింది అందుకేనని ఆలస్యంగా వెల్లడైంది. అదే సమయంలో కాంగ్రెస్ లోకి ప్రశాంత్ కిషోర్ చేరికపై తొలిసారి అధికారిక వ్యాఖ్యలు వెలువడ్డాయి. తద్వారా హైదరాబాద్ కేంద్రంగా మూడు రోజులుగా సాగుతోన్న హైడ్రామాకు తెరపడినట్లయింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజా ప్రకటనలతో కేసీఆర్-పీకే బంధం ముగిసినట్లు స్పష్టమైపోయింది. వివరాలివే..
కాంగ్రెస్ పార్టీలో చేరికకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సడన్ గా మొన్న శనివారం హైదరాబాద్ రావడం, ఏకంగా రెండు రోజులపాటు సీఎం కేసీఆర్ తోనే కలిసుండి, రాజకీయ వ్యూహాలపై చర్చలు జరపడం తెలిసిందే. గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపాక్ సంస్థ టీఆర్ఎస్ కు సేవలు అందిస్తోన్న క్రమంలో ఇప్పుడు పీకే కాంగ్రెస్ లో చేరితే పరిస్థితి ఏమిటనేదానిపై లోతైన సంభాషణలు జరిగాయి. తాను కాంగ్రెస్ లో చేరినా తన ఐపాక్ సంస్థ టీఆర్ఎస్ కోసం యథాతథంగా పనిచేస్తుందని పీకే.. సీఎం కేసీఆర్ కు క్లారిటీ ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వీళ్ల భేటీపై ముందు నుంచీ వ్యక్తమవుతోన్న అనుమానాలే చివరికి వాస్తవాలుగా తేలాయి. పీకే వచ్చింది కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా వదిలించుకోడానికేనని వెల్లడైంది.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం దక్కనీయకుండా పకడ్బందీ వ్యూహాలను పీకే టీఆర్ఎస్ కోసం సిద్దం చేశారని, అందులో భాగంగా దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టడం, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి(అది కాంగ్రెస్ నేతృత్వంలోనిదైనా సరే) మద్దతు పలకడం, కొత్త ఓటర్లను ఆకర్షించడానికి సరికొత్త ఐడియాలతో ముందుకు వెళ్లడం లాంటి వ్యూహాలను పీకే వివరించగా, చాలా వాటికి కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లూ కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే పీకే ఇక ఏమాత్రమూ కేసీఆర్ తో కలిసి కొనసాగలేరని, ఆయన కాంగ్రెస్ లో చేరడం వంద శాతం నిర్ధారణ అయిందని తాజాగా వెల్లడైన వార్త.
కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ గా తర్వరలోనే పార్టీలో చేరబోతున్న ప్రశాంత్ కిషోర్ గురించి రేవంత్ రెడ్డి సంచలన విషయాలు చెప్పారు. అసలు కేసీఆర్-పీకే భేటీ ఉద్దేశాన్ని కూడా స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌తో ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ సారథి ప్రశాంత్ కిశోర్(పీకే) భేటీపై స్పందించారు. టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకునేందుకే పీకే కేసీఆర్‌ను కలిశారని చెప్పారు.
‘ఇకపై టీఆర్ఎస్ కుగానీ, సీఎం కేసీఆర్ తోగానీ ప్రశాంత్ కిషోర్ కు ఎలాంటి సంబంధం ఉండదు. పీకే ఐపాక్ సంస్థకూడా టీఆర్ఎస్ కోసం పనిచేయదు. ఈ విషయంలో ముందు నుంచి నేను చెప్పిందే ఇప్పుడు జరిగింది. పీకే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తెలంగాణకు వచ్చి నాతో జాయింట్ ప్రెస్‌మీట్ పెట్టే రోజు చాలా దగ్గర్లోనే ఉంది. ఆ రోజు పీకే స్వయంగా టీఆర్ఎస్ కేసీఆర్ ను ఓడిస్తామని ఆయన నోటిమాటగా మీరు(మీడియా) వినబోతున్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరాక ఆయనకు అధిష్ఠానం మాటే శిరోధార్యం అవుతుంది’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరడానికి సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నప్పటికీ చేరికపై ఇప్పటిదాకా అధికారిక ప్రకటనగానీ, అధ్యక్షుల వ్యాఖ్యలుగానీ వెలువడలేదు. ఇటీవల సోనియా వీరవిధేయుడైన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పీకేను బ్రాండ్ అంటూ పొగిడినా పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన తొలి వ్యక్తి మాత్రం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే. పీకే కాంగ్రెస్ లో చేరడానికి అడ్డుగా ఉన్న ఏకైక అంశం టీఆర్ఎస్ కేసీఆర్ తో దోస్తీనే కావడంతో దానికి కటీఫ్ చెప్పడానికే ఆయన హైదరాబాద్ వచ్చారని, మర్యాదపూర్వకంగా ఆ పనిని ముగించుకున్నారని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Congress, Prashant kishor, Revanth Reddy, Telangana, Trs