Home /News /telangana /

POSTERS AGAINST MOAISTS IN KHAMMAM DISTRICT CREATES SENSATION IN TELANGANA BA KMM

మావోయిస్టులపై కొత్త ఆయుధం, పేర్లు లేని పోస్టర్లతో ఏజెన్సీలో కలకలం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Posters against Maoists | మావోయిస్టుల వైఖరితో విసిగిపోయి ఆదివాసీలు తమకు తామే ఇలా ప్రకటించారా...? ఇది పోలీసుల వ్యూహంలో భాగమా అనేది తెలియాల్సి ఉంది.

  Telangana Maoists | 'ఆదివాసీల అభివృద్ధికి ఆటంకంగా మారిన మావోయిస్టులను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి. ఆదివాసీలపై మావోయిస్టులు చేస్తున్న హింసాకాండకు అంతమే లేదా? ఆదివాసీ గ్రామాల అభివృద్ధిపై మావోయిస్టులకు చిత్తశుద్ధి లేదా? ఎన్నాళ్లిలా ఆదివాసీల కష్టాన్ని దోచుకుని తింటారు?’ ఇలాంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏజెన్సీ వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ఇప్పటిదాకా పోస్టర్లు వేయడం, తమ వైఖరిని, పోరాట పంథాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మావోయిస్టులు అవలంభించిన వైఖరిని ఇప్పుడు వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వర్గాలు చేపట్టినట్టు స్పష్టమవుతోంది. మరి ఇది పోలీసుల ప్రోద్బలంతో జరిగిందా? లేక ఆదివాసీ ప్రజల్లోనే మావోయిస్టుల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఈ రూపంలో వ్యక్తమవుతోందా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన దగ్గరి నుంచి రాష్ట్రంలో మావోయిస్టుల అలజడి తగ్గిపోయింది. దాదాపు ఆరేళ్ల అనంతరం గత జులైలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో మళ్లీ మావోయిస్టు యాక్షన్‌ టీంలు ప్రవేశించినట్టు రూఢీ అయింది. పక్కా సమాచారంతో కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులతో మావోయిస్టులకు పలుమార్లు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే యాక్షన్‌ టీం సభ్యులు మాత్రం తప్పించుకున్నారు. వారి కోసం ఇప్పటికీ ముమ్మర గాలింపు నడుస్తునే ఉంది. ఈ క్రమంలో మావోయిస్టులు చాలా కాలం తర్వాత కమిటీలు ప్రకటించారు. ప్రతిగా ప్రభుత్వం కూడా మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించడంతో, ఎదురు కాల్పులు జరిగిన రెండు జిల్లాల్లోనూ డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐజీ నాగిరెడ్డిలు పర్యటించారు. అనంతరం ఓ పదకొండు మంది మావోయిస్టులకు సంబంధించి.. వారిని పట్టిస్తే రూ.5 లక్షల బహుమానం ప్రకటిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ ఏకంగా ఫ్లెక్సీలనే ఏర్పాటు చేయించారు. దీనికితోడు ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోనూ, విశాఖ, తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతంలోనూ మావోయిస్టుల కదలికలు కనిపించాయి. మావోయిస్టు టాప్‌ క్యాడర్‌ ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ప్రవేశించిందన్న నిఘా వర్గాల సమాచారంతో సంయుక్త కూంబింగ్‌ ఆపరేషన్లు ముమ్మరమయ్యాయి. అయితే తాము మావోయిస్టు టాప్‌ క్యాడర్‌తో కూడిన ఓ పెద్ద బృందాన్ని అరెస్టు చేశామని ఒడిశా డీజీపీ ప్రకటించాక రెండు రాష్ట్రాల్లోని పోలీసులు కాస్త దూకుడు తగ్గించాయి.

  మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు


  ఈ నేపథ్యంలో మావోయిస్టులు ప్రజాకంటకంగా మారారంటూ, వారిపై ప్రభుత్వంతో పనిలేకుండా ప్రజాపోరాటం చేస్తామంటూ కొందరు ప్రకటనలు చేశారు. తాజాగా మావోయిస్టులు అమాయకులైన ఆదివాసీలకు మద్దతుగా ప్రకటిస్తూ వారిని తమ వైపు తిప్పుకొని వారి సమాజం నుంచి అభివృద్ధి నుంచి దూరం చేస్తున్నారంటూ ఏజెన్సీలోని పలు చోట్ల మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఆ లేఖలో మావోయిస్టులు అమాయక ఆదివాసీలను బలిపశువులుగా వాడుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉనికి చాటుకోవడానికి అమాయకులైన ఆదివాసీలను మభ్యపెట్టి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఉసిగొల్పుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టుల హింసాకాండను కు అధికంగా నష్టపోతున్నది గిరిజనులు, బడుగు బలహీన వర్గాలేనని ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు, వ్యాపారులు, అధికారులు, ఇతర వర్గాల నుంచి తమ బినామీలను గ్రామాల్లోకి పంపి రహస్యంగా దోచుకుంటున్నారని.. దీనివల్ల పోలీసుల అనుమానంతో అమాయక గిరిజనులు బలవుతున్నారని.. మావోయిస్టులు కొనసాగిస్తున్న మతిలేని హింస తో ఎక్కువ మంది గిరిజనం నష్టపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. పొట్టకూటి కోసం అడవిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆదివాసీలపై మావోయిస్టులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని, వారి ఆటలో వీరు పావుగా మారారని ఆ లేఖలో ఉటంకిస్తూ మావోయిస్టులకు ప్రశ్నల వర్షం కురిపించారు. మీవల్ల ఎన్నడన్నా, ఏ విషయంలోనైనా ఆదివాసీలకు న్యాయం జరిగిందా..? ఆదివాసీలకు మీరు చేసే న్యాయం ఏమిటి? మీ వల్ల ఒక్క ఆదివాసీ జీవితమైనా బాగు పడిందా? అభివృద్ధి అంటే ఆదివాసీలు సంపాదించిన బియ్యం కూరగాయలు నిత్యావసరాలు దౌర్జన్యంగా తీసుకోవడమా? అని అనేక ప్రశ్నలు ఆ లేఖలో సంధించారు. ఆదివాసీల ప్రగతిని అడ్డుకోవడం సరి కాదని,మావోయిస్టుల వల్ల ఆదివాసీలకు పెను ముప్పు ఉందని లేఖలో వివరించారు. ఈ లేఖలను ఏజెన్సీ వ్యాప్తంగా గుర్తుతెలియని వ్యక్తులు అక్కడక్కడా వెదజల్లినట్టు తెలుస్తోంది. అయితే దీనివెనుక ఎవరున్నారన్నది తెలియాల్సి ఉంది.

  మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు


  మావోయిస్టుల వైఖరితో విసిగిపోయి ఆదివాసీలు తమకు తామే ఇలా ప్రకటించారా...? లేక ఆదివాసీల మనోభావాలను ఏదైనా సంస్థ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది పోలీసుల వ్యూహంలో భాగం కూడా అయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం, కరకగూడెం, మణుగూరు పోలీసుస్టేషన్ల పరిధిలో ఈ కరపత్రాలను పంపిణీ చేశారు. మొండికుంట, అశ్వాపురం, తుమ్మలచెరువు, గొందిగూడెం, తిర్లాపురం ప్రాంతాల్లో ఇవి కనిపించాయి. మొత్తంమీద ఇప్పటిదాకా మావోయిస్టులు దండకారణ్యం ఏజెన్సీలో ఎవరి సహాయ సహకారాలతో తమ ఉద్యమ ఉనికిని కాపాడుకుంటున్నారో వారినే అస్త్రంగా ప్రయోగిస్తూ జరిగిన ప్రయోగంగా దీన్ని చూడొచ్చని ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Khammam, Maoists, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు