వేములవాడలో ఓ యువకుడికి ఏలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేకుండానే వైద్య పరీక్షల్లో పాజిటివ్ రావడం స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ ప్రార్థనలకు మార్చి 14న వేములవాడ నుంచి నలుగురు యువకులు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం నలుగురు యువకులు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారు. అయితే అప్పుడు వైద్య అధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పది రోజుల క్రితం వచ్చిన రిపోర్టుల్లో నెగిటివ్ వచ్చింది. తాజాగా గురువారం రెండోసారి నలుగురు యువకుల శాంపిల్స్‌ను వైద్య పరీక్షల కోసం పంపారు. అందులో ఓ యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో అంతా విస్తుపోయారు. సదరు యువకుడికి ఏలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేకుండానే నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో వైద్యులు మరింత అప్రమత్తమయ్యారు. సదరు యువకుడిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.