GHMC Elections: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు జై కొట్టిన పోసాని

పోసాని కృష్ణమురళి (ఫైల్ ఫోటో)

Posani Krishna Murali: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తన మద్దతు టీఆర్‌ఎస్‌కే ఉంటుందన్న పోసాని కృష్ణ మురళి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తేనే హైదరాబాద్ క్షేమంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

  • Share this:
    GHMC ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ప్రజలను కోరారు. తన జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూశానన్న పోసాని.. కేసీఆర్‌ లాంటి పట్టుదల ఉన్న ముఖ్యమంత్రిని చూడలేదని అభిప్రాయపడ్డారు. జజీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో దర్శకుడు శంకర్‌తో కలిసి పోసాని శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో హిందూ, ముస్లింలు మత సామరస్యంతో ఉంటున్నారని పోసాని వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చాక ఏపీ ప్రజలపై ఎలాంటి దాడులు జరగలేదని ఆయన గుర్తు చేశారు.

    తెలంగాణ బిడ్డల మాదిరిగానే ఏపీ వారిని కేసీఆర్ క్షేమంగా చూస్తున్నారని పోసాని కొనియాడారు. హైదరాబాద్‌లో వందేళ్లలో ఎప్పుడూ రానంత స్థాయిలో వరదలు వచ్చాయని.. అందుకే ప్రజలు ఇబ్బందిపడ్డారని పోసాని అన్నారు. ఆ స్థాయిలో వరదలు వస్తే వందమంది కేసీఆర్‌లు ఉన్నా ఏమీ చేయలేరని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో శాంతిభద్రతలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. ఆంధ్రా ప్రజలపై కేసీఆర్‌కు ఏమాత్రం కోపం లేదని, కేవలం దోచుకున్న వారిపైనే కోపంతో ఉన్నారని వెల్లడించారు.

    తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తమేనని పోసాని వ్యాఖ్యానించారు. తెలంగాణలో గతంలో తాగు, సాగునీటి సమస్యలు ఉండేవని.. కేసీఆర్ వచ్చాక ఆ సమస్యలు చాలావరకు పరిష్కారం అయ్యాయని అన్నారు. విద్యుత్ విషయంలోనూ కేసీఆర్ వ్యవహరించిన తీరు బాగుందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తన మద్దతు టీఆర్‌ఎస్‌కే ఉంటుందన్న పోసాని కృష్ణ మురళి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తేనే హైదరాబాద్ క్షేమంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
    Published by:Kishore Akkaladevi
    First published: