హైదారబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోదీ పాల్గొన్న విజయ సంకల్ప యాత్ర సభ సక్సెస్ తర్వాత ఊపుమీద కనిపిస్తోన్న తెలంగాణ బీజేపీ (Telangana BJP).. కేసీఆర్ వ్యతిరేక శక్తులు, వ్యక్తులను తనవైపునకు లాక్కొనే ప్రయత్నాన్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగానే టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) ప్రముఖ న్యాయవాది రచనా రెడ్డి (Advocate Rachana Reddy)తో చర్చలు జరిపారు.
పలు కీలక కేసుల్లో కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా పోరాడుతోన్న తెలంగాణ హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌తో ఆమె భేటీ అయ్యారు. పార్టీలో చేరాల్సింది సంజయ్ ఆమెను ఆహ్వానించినట్లు సమాచారం.
బండితో చర్చల అనంతరం రచనా రెడ్డి మాట్లాడారని, బీజేపీలో చేరికపైనే సంజయ్‌తో చర్చలు జరిపానని.. త్వరలోనే బీజేపీలో చేరతానని వెల్లడించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, రచనారెడ్డిగానీ, బీజేపీగానీ ఈ అంశంపై ఇప్పటిదాకా అధికారిక ప్రకటనైతే చేయలేదు.
తెలంగాణ హైకోర్టు న్యాయవాదిగా సుపరిచితురాలైన రచనా రెడ్డి గతంలో తెలంగాణ జనసమితిలో చేరారు. అయితే కొద్దిరోజులకే పార్టీ అధ్యక్షుడు కోదండరాంతో విభేదాలు రావడంతో పార్టీ ఉపాధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బయటికి వచ్చేశారు.
కేసీఆర్ సర్కారు ప్రతిష్టంగా భావించే కాళేశ్వరం, మల్లన్న సాగర్ తదితర ప్రాజెక్టుల ముంపు రైతుల తరపున హైకోర్టులో కేసులు వేసి వాదించడంతో రచనారెడ్డి పాపులర్ అయ్యారు. తొలి నుంచీ కేసీఆర్ విధానాలను వ్యతిరేకిస్తున్నారామె. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనా రెడ్డి వేసిన కేసులను అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించడం విశేషం.
నిజానికి బీజేపీలో చేరికల కోసమే ఈటల రాజేందర్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఏకాభిప్రాయం ఉన్నవారు, టీఆర్ఎస్ వ్యతిరేకులైన ప్రముఖులతోపాటు ఇతర పార్టీల్లోని వారిని బీజేపీలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈటల కమిటీ పనిచేయాల్సి ఉంది. అయితే, బండి తన విశేష అధికారాలతో సొంతగానే వ్యవహారాలు చూస్తుండటంతో పార్టీలో అంతర్గత విభేదాల అంశం మరోసారి చర్చనీయాశమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, Telangana, Telangana High Court