Khammam : భట్టి టార్గెట్..అధికార టీఆర్ఎస్ నేతల సోషల్ మీడియా ప్రచారం

భట్టి టార్గెట్..అధికార టీఆర్ఎస్ నేతల సోషల్ మీడియా ప్రచారం

Khammam : సీఎల్పీ నేత భట్టివిక్రమార్క టార్గెట్‌గా.. మంత్రి పువ్వాడ ఎత్తులు.. టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లక్ష్యంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ రాజకీయ ఎత్తుగడలు సిద్ధం చేస్తున్నారా...? ఆయన అనుమతితోనే భట్టివిక్రమార్కపై సోషల్‌మీడియాలో తెరాస శ్రేణి విమర్శల వేడి పెంచిందా..? భట్టి రాజకీయ పునాదులను పెకలించాలన్న టార్గెట్‌తోనే ఇదంతా జరుగుతోందా..? అంటే వర్తమాన పరిస్థితులు అవుననే అంటున్నాయి.

  • Share this:
జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా

ఖమ్మం మునిసిపల్‌ ఎన్నికలు ముగిసి.. తెరాస ఘన విజయం సాధించినా.. ఇంకా ఎక్కడో కాంగ్రెస్ బేస్‌ సడలలేదన్న సంశయం తెరాస నేతల్లో కనిపిస్తోంది. నిజానికి ఏ ఒకటో రెండో డివిజన్లకే పరిమితం అవుతుందనుకున్న కాంగ్రెస్‌ ఏకంగా పది డివిజన్లను తన ఖాతాలో వేసుకుంది. ఇది కాంగ్రెస్ నేతలు సైతం ఊహించని ఫలితం.. దీంతో కాంగ్రెస్‌ పార్టీని ఖమ్మం మునిసిపల్‌ ఎన్నికలలో ఆశించిన మేర నిలువరించలేకపోయామన్న అంతర్మధనం తెరాస నాయకత్వాన్నివెంటాడుతునే ఉంది. దీంతో ఇక ఏ మాత్రం అవకాశం దొరికినా కాంగ్రెస్ టార్గెట్‌గా రాజకీయాలు సాగుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు చాటుతున్నాయి. ఈ టార్గెట్‌ వార్‌ ఈ మధ్య సోషల్ మీడియా వేదికకు మారడంతో మరింత చర్చనీయాంశంగా మారింది.

కోవిడ్‌-19 కరోనా వైరస్‌ బాధితులను పరామర్శించడానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపీఈ కిట్‌ వేసుకుని ఆసుపత్రులకు వెళ్లారు. మీడియాతో మాట్లాడే సమయంలోనూ ఆయన అదే విధంగా కనిపించారు. ఇలా భట్టి విక్రమార్క అటు తన నియోజకవర్గ కేంద్రమైన మధిరలోనూ, ఖమ్మంలోనూ ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించారు.

తాజాగా రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆసుపత్రులను సందర్శించారు. ప్రత్యేకంగా కోవిడ్ వార్డుల్లో ఉన్న రోగుల బాగోగులను తెలుసుకుంటూ.. వారికి తన కుటుంబం తరపున మధ్యాహ్న భోజనాన్ని కూడా అందించారు. ఈ సందర్భంలో ఆయన కేవలం మాస్క్‌ మాత్రమే పెట్టుకున్నారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతిలో సైతం ధైర్యంగా రోగులను పరామర్శించడమే కాకుండా.. వారికి ఆహారం అందించడం.. కొన్ని గంటలపాటు వారితో గడపడం.. వారికి ఆత్మస్థైర్యాన్ని అందించడం.. అదీ ఎలాంటి పీపీఈ కిట్‌ ధరించకుండానే ఇదంతా చేయడంతో.. తెరాస సోషల్‌ మీడియా శ్రేణులు ఈ అంశాలనే ఆయుధంగా మలచుకున్నాయి.

'ఇదిగో మహానటుడు భట్టివిక్రమార్క పీపీఈ కిట్‌లో ఇలా.. మనసున్న ప్రజా నాయకుడు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇలా.. అంటూ సోషల్‌మీడియా వార్‌ స్టార్ట్‌ చేశారు. వీటిని విపరీతంగా వైరల్‌ చేస్తూ.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను నేరుగా టార్గెట్‌ చేశారు. దీనికి కొనసాగింపుగా అన్నట్టు.. ఈ వారంలో మధిర పట్టణంలో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను మంత్రి అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సభకు హాజరైన స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు కనీసం మైకు కూడా ఇవ్వలేదు. వాస్తవానికి స్థానిక ఎమ్మెల్యేగా భట్టివిక్రమార్కకు ప్రోటోకాల్‌ ఉంటుంది. ఎలాంటి అధికారిక సభలు, సమావేశాలు జరిగినా.. అధ్యక్షత వహించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ భట్టివిర్కమార్కకు ఆ అవకాశం లభించలేదు. పైగా మంత్రి అజయ్‌కుమార్‌ నేరుగా భట్టి విక్రమార్కను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు.

'కూలిపోయే ఆసుపత్రులు.. వసతులు లేని ఆసుపత్రులను మాకు మీరు వారసత్వంగా ఇచ్చారు..' అంటూ ఆయన సమక్షంలోనే విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే తెరాస శ్రేణులు ఇంకాస్త ముందుకెళ్లి 'మధిర ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ.. సోషల్‌ మీడియాలో దెప్పిపొడుపులు మొదలుపెట్టారు. ఇక ఈ నియోజకవర్గం నుంచి భట్టివిర్కమార్కకు చిరకాల ప్రత్యర్థి అయిన జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు మాత్రం ఎక్కడ అవకాశం దొరికినా భట్టివిక్రమార్కపై విమర్శల దాడికి దిగుతున్నారు. మూడుమార్లు మధిర ఎమ్మెల్యేగా గెలిచి.. గతంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా.. డిఫ్యూటీ స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి ఇక్కడి వైద్యశాలను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారంటూ నేరుగా దాడికి దిగారు.

కరోనా కష్టకాలంలో వైరస్‌ బారిన పడి ప్రాణాంతకం అవుతున్న పరిస్థితుల్లో నేనున్నానంటూ ఇటు ఐటీసీ యాజమాన్యంతో మాట్లాడి ఆక్సిజన్‌ నిరంతర సరఫరాలోనూ.. అటు హెటెరో డ్రగ్స్‌ అధినేత బండి పార్ధసారధిరెడ్డితో సంప్రదించి రెమిడెసివర్ ఇంజెక్షన్ల సరఫరాలోనూ జిల్లా ప్రజలకు లోటు రాకుండా మంత్రి అజయ్‌కుమార్‌ చొరవ చూపారు. పైగా ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రులకు సైతం అవసరాన్ని బట్టి సరఫరాను రోజువారీగా నిర్ణయించారు. దీంతో ఆక్సిజన్‌, రెమిడిసివర్‌ ఇంజెక్షన్ల కొరతతో ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి జిల్లా ప్రజలు బయటపడినట్టే. ఈ అంశాలను తెరాస శ్రేణులు విస్త్రుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, చర్చ జరిగేలా చూడడంలో సక్సెస్‌ అయినట్టే కనిపిస్తోంది.

ఈ క్రమంలో ఖమ్మం పట్టణంలోని 57వ డివిజన్‌లో శుక్రవారం తెరాస, కాంగ్రెస్‌ పరస్పర దాడులకు దిగడం కొత్త ఒరవడికి దారితీసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇక్కడ మాజీ కార్పోరేటర్‌, ప్రస్తుత కార్పోరేటర్‌ ల మధ్య ఆధిపత్యపోరుతో పరస్పరం దాడులకు దిగడం.. తీవ్రంగా గాయపర్చుకోవడం.. పోలీసుకేసులు నమోదు కావడం ఖమ్మంలో ఒక కొత్త తరహా రాజకీయాలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంమీద గతంలో కాంగ్రెస్‌లో ఉన్న సమయంలోనూ తనను ఇబ్బందుల పాల్జేసిన భట్టివిక్రమార్క రాజకీయ పునాదులను పెకలిస్తే.. భవిష్యత్‌లో కాంగ్రెస్ కు ఇక్కడ పెద్దగా నాయకత్వం బలపడే పరిస్థితి లేదు. దీంతో భట్టివిక్రమార్క టార్గెట్‌గానే ప్రస్తుతం తెరాసలోని అన్ని స్థాయుల్లోని నేతలు, శ్రేణులు తమ ఆయుధాలను ఎక్కుపెడుతున్నట్టు స్పష్టమవుతోంది.
Published by:yveerash yveerash
First published: