హోమ్ /వార్తలు /తెలంగాణ /

Wall Teaching: గోడమీద రాతలు.. చౌరస్తాలో బడులు.. పోలీసుల వినూత్న ప్రయోగం.. ఎక్కడంటే..

Wall Teaching: గోడమీద రాతలు.. చౌరస్తాలో బడులు.. పోలీసుల వినూత్న ప్రయోగం.. ఎక్కడంటే..

గోడపై అక్షరాలను విద్యార్థులకు బోధిస్తున్న దృశ్యం

గోడపై అక్షరాలను విద్యార్థులకు బోధిస్తున్న దృశ్యం

Wall Teaching: కరోనా కారణంగా విద్యార్థులంతా ఇంటి వద్దే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే వారు నేర్చుకున్న కొన్ని అక్షరాలు సైతం మర్చిపోయే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు విద్యార్థుల కోసం వినూత్నంగా ప్రయత్నించారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

  (కట్టా లెనిన్, ఆదిలాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)

  కరోనా మహమ్మారి విలయతాండవానికి ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. సామాన్యులు సతమతమవుతున్నారు. సంవత్సర కాలంగా బడులు మూతపడి విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. కొన్ని రోజులు ఆన్ లైన్ తరగతులు నిర్వహించినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గూడాల్లో సిగ్నల్ లేక ఆన్ లైన్ క్లాసులకు నోచుకోలేదు. తరగతులు లేక, బడులు కొనసాగక ఆదివాసి విద్యార్థులు ఇంటికి పరిమితమయ్యారు. తాము నేర్చుకున్న నాలుగు అక్షరాలను కూడా మర్చిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల తిర్యాణి మండలంలోని ఆదివాసి గూడాల్లోని విద్యార్థుల భవిషత్తును దృష్టిలో ఉంచుకొని వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే గూడాల్లోని కూడళ్లలోని గోడలను బ్లాక్ బోర్డులుగా మార్చి చౌరస్తాలను బడులు తీర్చి దిద్దారు తిర్యాణి ఎస్ ఐ పి రామరావు. ఆదివాసి గూడాల్లోని చిన్నారుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు, నేర్చుకున్న వాటిని మరిచిపోకుండా ఉండేందుకు గోడలపై తెలుగు, ఇంగ్లీష్ వర్ణమాల, అంకెలు, గుణింతాలను రాయించారు.

  ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారులు వాటిని చదివేలా ప్రోత్సహిస్తున్నారు. అంకెలు, అక్షరాలను గుర్తుంచుకునేందుకు వీలుగా, కనీస సామర్థ్యాలను పెంపొందించుకునేలా చూస్తున్నారు. ఇలా పోలీసులు మండలంలోని మంగీ, కొలాంగూడ, హాస్టల్ గూడ, రొంపెల్లి, మేస్రంగూడ, పంగిడిమాధర ,మొర్రిగూడ, తలండీ లాంటి ౩౦కి పైగా ఆదివాసి గూడేలలో గోడలపై వాల్ రైటింగ్ రూపములో రాయించి ఆదివాసి పిల్లలు తాము నేర్చుకున్న మౌలిక అక్షరాలు లాక్ డౌన్ సమయంలో మరచిపోకుండా ఉండేందుకు కృషిచేస్తున్నారు. ఆయ గుడెలలో పెద్దతరగతి చదువుకున్న పిల్లలతొ చిన్నపిల్లలకి ఉదయం, సాయంత్రం ఆట పాటలతో నేర్చుకుందుకు ఆయా గూడాల పటెల్ ల సహకారం కూడా తీసుకుంటున్నారు.

  కరోనా కారణంగా బడులు మూతపడి చదువుకు దూరమవుతున్న చిన్నారులు అభ్యాసం కొనసాగించేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసినట్లు తిర్యాణి ఎస్.ఐ. రామారావు తెలిపారు. తాము చేస్తున్న ఈ ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందని, చిన్నారులు చదువు పట్ల ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఆదివాసి గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తిర్యాణి పోలీసులు చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నాన్ని అందరు అభినందించాల్సిందే.

  Published by:Veera Babu
  First published:

  Tags: Adilabad, Teaching, Telangana Police, Telangana students

  ఉత్తమ కథలు