POLICE WERE ARRESTED WHO INVOLVED GANJA SMUGGLING IN KHAMMAM DISTRICT KMM VRY
Khammam : గంజాయి స్మగ్లర్స్‌గా ఇద్దరు కానిస్టేబుల్స్.. జైల్లో ఉన్న స్మగ్లర్స్‌తో లింక్..
అరెస్ట్ అయిన కానిస్టెబుల్
Khammam : గంజాయి స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులకు షాక్ తగిలింది. స్మగ్లింగ్‌కు పోలీస్ డిపార్ట్మెంట్లోని కొంతమంది కానిస్టేబుల్స్, ఇతర వ్యక్తులు కూడా సహకరించడంతో పాటు నేరుగా స్మగ్లింగ్ చేస్తున్న కానిస్టేబుల్‌ను ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.. దీంతో ఖమ్మం జిల్లా పోలీసు వర్గాల్లో అలజడి మొదలైంది.
గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో ఏకంగా ఇద్దరు పోలీసుల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్టు వెల్లడైంది. ఏఆర్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న సతీష్, వెంకటేశ్వర్లు గత కొన్నేళ్లుగా ఈ వ్యవహారంలో నిమగ్నం అయినట్టు ఖమ్మం జిల్లా పోలీసులు గుర్తించారు. దీంతో ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్‌కు అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు నిఘా వర్గాలను అలర్ట్ చేశారు. దీంతో బుధవారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా ఉన్న ఓ ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేయడంతో ఐదు కిలోల గంజాయి దొరికింది. ఆ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. వీరిలో కొండ సతీష్ అనే వ్యక్తి ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతనితో పాటు కొణిజెర్ల మండలం పల్లిపాడుకు చెందిన పొల్లెబోయిన వెంకటేశ్వర్లును కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఐదు కిలోల గంజాయి, ఓ ద్విచక్ర వాహనం (ఏపీ 20 ఏజీ 3113) స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ ఐదు కిలోల గంజాయి ప్యాక్‌ను ఖమ్మం శివారులోని హార్వెస్టు స్కూల్ ప్రాంతంలో మరొక వ్యక్తికి చేరవేసే క్రమంలో నిఘా పెట్టి, అదుపులోకి తీసుకున్నట్టు టౌన్ ఏసీపీ ఆంజనేయులు ప్రకటించారు. వీరి దగ్గర దొరికిన ఐదు కిలోల గంజాయి ప్యాక్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో్ పనిచేస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్, కారేపల్లి మండలం తొడితలగూడేనికి చెందిన తన సమీప బంధువైన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి కొనుగోలు చేసి మరో ఏఆర్ కానిస్టేబుల్ సతీష్‌కు అప్పగించినట్టు తేల్చారు. ఈ ప్యాక్‌ను మరో చోటుకు చేర్చే క్రమంలో నిఘా వేసి మరీ పట్టుకున్నారు.
ఇద్దరు కానిస్టేబుల్స్.. ఓ లాయర్..
ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు.. ఓ జైలు వార్డర్.. మరో లాయర్.. ఇంకా ఓ ఇంజినీరింగ్ విద్యార్ధి.. ఇలా ఈ వ్యవహారంలో మొత్తం ఏడుగురు ఉన్నట్టు ప్రాధమికంగా అనుమానిస్తుండగా, ఇప్పటికే నలుగుర్ని గుర్తించి, ఇద్దరిని అరెస్టు చేయగా మరో ఏఆర్ కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు. ఇంకా మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఏఆర్ కాసిస్టేబుల్ సతీష్, పరారీలో ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్‌లు గత నాలుగేళ్లుగా ఈ వ్యవహారంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వీరికి ఖమ్మం జిల్లా జైలులో పనిచేసే ఓ వార్డర్ తోడయ్యాడు. తరచూ గంజాయి కేసుల్లో జైలుకు వచ్చే ఓ ముఠా ద్వారా వీరికి గంజాయి స్మగ్లింగ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఏర్పడినట్టు చెబుతున్నారు.
ఒడిషా నుంచి చత్తీస్ఘడ్ మీదుగా చింతూరు, భద్రాచలం మీదుగా ఏళ్ల తరబడి సాగుతున్న ఈ స్మగ్లింగ్‌లో ఈ ముఠాతో మొత్తం రూ.11 కోట్ల విలువైన డీల్ కుదిరినట్టు అనుమానిస్తున్నారు. ఈ డీల్‌ను దఫాల వారీగా అమలు చేసేలా.. దీనికిగానూ దఫాల వారీగా చెల్లింపులు చేసేలా ఓ లాయర్ సమక్షంలో అగ్రిమెంటు రాసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. గంజాయి సరఫరాలో పలు దఫాలు దొరికిన నేరస్తులతో కుదిరిన స్నేహం వీరిని ఇలాంటి వాటికి పురికొల్పినట్టు అనుమానిస్తున్నారు. అయితే కేవలం ఏఆర్ కానిస్టేబుళ్ల స్థాయిలో ఇంత ధైర్యం చేస్తారా..? వీరి వెనుక పెద్ద స్థాయి అధికారుల అండదండలు ఉండే అవకాశాల పైనా ఆరా తీస్తున్నారు. పోలీసుశాఖకే మచ్చగా మారిన ఈ వ్యవహారంలో ఎంతటి వాళ్లున్నా చట్టం ముందు నిలబెడతామని సీపీ విష్ణు వారియర్ చెబుతున్నారు.
డీజీపీ ఆదేశాలు..
అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఒడిషా, చత్తీస్‌ఘడ్‌ల నుంచి భారీగా దేశంలోని పలు ప్రాంతాలకు సరఫరా అవుతున్న గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో పోలీసుల పాత్ర ఉందన్న విశ్వీసనీయ సమాచారం మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి జిల్లా ఉన్నతాధికారులను అలర్ట్ చేసినట్టు చెబుతున్నారు. నానాటికీ పెరుగుతున్ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ముఖ్యంగా యువత నిర్వీర్యం అవుతున్న తీరుపై గత వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఎక్కడికక్కడ పోలీసులు, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆదేశించారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.