పోలీస్ కేసుల్లో స్నైఫర్ డాగ్స్ కీలక పాత్ర పోషిస్తుంటాయి. కేసుకు సంబంధించి ఆధారాల సేకరణలో పోలీస్ కుక్కలు ముందుంటాయి. ఏదైనా మర్డర్ జరిగినప్పుడు నిందితుడిని గుర్తించాలన్నా.. ఎక్కడైనా బాంబు పెడితే పసిగట్టాలన్నా స్నైఫర్ డాగ్స్ ఉండాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే ఆ డాగ్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అన్నట్లు..! ఐతే నల్లగొండలో పోలీస్ శాఖలో తొమ్మిదేళ్లుగా సేవలందిస్తున్న స్నైఫర్ డాగ్ లక్కీ మరణించింది. అనారోగ్యంతో సోమవారం కన్నుమూసింది. లక్కీ మృతి పట్ల జిల్లా పోలీస్ అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం స్నైఫర్ డాగ్ లక్కీకి పోలీస్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
లక్కీ ఎన్నో కేసుల్లో కీలక భూమిక పోషించింది. కేసుల చిక్కుముడి విప్పడంలో పోలీసులకు ఎంతగానో సాయం చేసింది. 2013 డిసెంబరు 13న దేవరకొండ పరిధిలోని కంబాలపల్లిలో దాచిన నాటు బాంబును గుర్తించింది. పేలుడు జరగకుండా ఎంతో మందిని కాపాడింది. ఇక 2014, మే 3న సంస్థాన్ నారాయణపురంలో పాతిపెట్టిన ల్యాండ్ మైన్లను గుర్తించింది లక్కీ. అంతేకాదు ఎంతో మంది వీఐపీల బందోబస్తులో సేవలు అందించింది. ఈ స్నైఫర్ డాగ్‌తో ఎంతో మంది పోలీసులకు మంచి అనుబంధం ఉంది. అందుకే లక్కీ మృతి చెందిందన్న వార్త వినగానే పోలీసులు కన్నీటి పర్యంతమయ్యారు. లక్కీ సరంక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ కన్నీరు మున్నీరయ్యారు. ఆశ్రునయనాల మధ్య లక్కీకి తుది వీడ్కోలు పలికారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nalgonda, Telangana, Telangana Police