బండి సంజయ్ (Bandi Sanjay) ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రపై తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ రాజకీయ రగడ రాజుకుంది. సోమవారం నుంచి నిర్మల్ జిల్లా భైంసా నుంచి బండి సంజయ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రూట్ మ్యాప్, షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. ఐతే ఆఖరి నిమిషంలో బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కరీంనగర్ నుంచి భైంసాకు వెళ్తుండగా.. కోరుట్ల సమీపంలో ఆయన అడ్డుకున్నారు. అన్ని అనుమతులు ఇచ్చాక.. ఆఖరి నిమిషంలో ఎలా అడ్డుకుంటారంటూ.. పోలీసులతో బండి సంజయ్ వాగ్వాదానికి దిగారు. బీజేపీ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగడంతో.. అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆయన్ను బలవంతంగా కరీంనగర్‌కు తరలించారు.
తాను భైంసాకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై బండి సంజయ్ మండిపడ్డారు. పాద యాత్ర కు ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు హఠాత్తుగా క్యాన్సిల్ చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
''పాదయాత్రకు ముందస్తు అనుమతులు ఇచ్చారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ కూడా వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూట్ మ్యాప్ కూడా ఖరారయ్యక ఇప్పుడు పోలీసులు హఠాత్తుగా అడ్డుకుంటున్నారు. భైంసా సున్నిత ప్రాంతం అంటున్నారు. అదేమైనా నిషేధిత ప్రాంతమా? అక్కడికి ఎందుకు పోవద్దు.బైంసానే కాపాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు. సీఎంకు చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలి. పోలీసుల రిక్వెస్ట్ మేరకు నేను ఇప్పుడు కరీంనగర్ పోతున్నా. రేపు మధ్యాహ్నం వరకు మాకు సమయం ఉంది. అప్పటివరకు వెయిట్ చూస్తాం.'' అని బండి సంజయ్ అన్నారు.
కాగా, ఐదో విడత పాదయాత్రలో భాగంగా భైంసా నుంచి కరీంనగర్ (Karimnagar) వరకు తలపెట్టారు. 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 17వ తేదీ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 14,15,16 తేదీలో చొప్పదండిలో యాత్ర కొనసాగగా..డిసెంబర్ 16,17న కరీంనగర్ లో పాదయాత్ర సాగగా చివరి రోజు కరీంనగర్ (Karimnagar) లోని SR నగర్ కళాశాల వద్ద పాదయాత్ర ముగియనుంది. కానీ ఈయాత్రకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.