Home /News /telangana /

POLICE SOLVED THE KIDNAPPING CASE OF A 13 MONTH OLD GIRL IN SHADHNAGAR WITH A SMALL CLUE MBNR PRV

Kidnap Chase: చిన్న క్లూతో చిన్నారి కిడ్నాప్​ మిస్టరీని ఛేదించిన పోలీసులు.. ఎలా చేశారో తెలుసా?

చిన్నారి, ఆమె తల్లితో పోలీసులు

చిన్నారి, ఆమె తల్లితో పోలీసులు

అభం శుభం తెలియని 13 నెలల చిన్నారిని ఓ ముఠా కిడ్నాప్ చేసింది. ఈనెల జూలై ఒకటో తేదీన జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. అయితే పోలీసులు చిన్న క్లూతో కేసును చేధించి ఔరా అనిపించుకున్నారు.

    (Sayyad rafi, News18, Mahbubnagar)

    అభం శుభం తెలియని 13 నెలల చిన్నారిని ఓ ముఠా కిడ్నాప్ (Kidnap) చేసింది. ఈనెల జూలై ఒకటో తేదీన జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ (Shadhnagar) నియోజకవర్గం కొత్తూరు మండలంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. షాద్ నగర్ ఏసీపీ (ACP) కుషాల్కర్ బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు పూర్వపరాలను మీడియాకు వివరించారు. కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. బాలరాజ్, ఎస్సై శంకర్, ఏఎస్ఐ షేక్ అబ్దుల్లా చాకచక్యంగా వ్యవహరించి కేసులోని మిస్టరీని ఛేదించారని కుశాల్కర్ తెలిపారు.

    సీసీటీవీ ఫుటేజ్లో..

    కొత్తూరు మండలం ఇన్ముముల్ నర్వ గ్రామానికి చెందిన పాత్లావత్ లావణ్య, శివ దంపతుల కూతురు వసంత (13 నెలలు)ను జూలై 1వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుని జీవిస్తుంటారు. కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గా సమీపంలో  జరిగిన ఈ కిడ్నాప్ తతంగం పై పోలీసులకు తల్లి లావణ్య ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓవైపు ప్రధానమంత్రి మోదీ బందోబస్తు హడావుడిలో ఉన్నప్పటికీ, మరోవైపు నేరస్తులను గుర్తించే పనిలో పడ్డారు. కొత్తూరు రూరల్ సీఐ సత్యనారాయణ ముందుగా ఈ కేసులో పరిశోధన చేపట్టారు. ఆ తర్వాత స్థానిక సీఐ బాలరాజు ఆధ్వర్యంలో ఎస్సై శంకర్, ఏఎస్ఐ షేక్ అబ్దుల్లా బృందం చాకచక్యంగా వ్యవహరించింది. సీసీటీవీ ఫుటేజ్ లో ఆ ప్రాంతంలో సంచరించిన ఆటోను పసిగట్టారు. అయితే సదరు ఆటోకు సంబంధించిన నంబర్ సగమే కనిపించింది. దీంతో ఏఎస్ఐ షేక్ అబ్దుల్లా సైబరాబాద్ ఎస్ఓసీ సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఇందులో ఆటోకు సంబంధించిన క్లూ లభించింది.

    పాతబస్తీలో ఆటో లభ్యం..

    చిన్నారి కిడ్నాప్ కేసును సవాలుగా స్వీకరించిన కొత్తూరు పోలీసులు ఆటో నెంబర్ వెతుక్కుంటూ హైదరాబాద్ పాతబస్తీలోని మొగల్ పురాకు చేరుకున్నారు. అక్కడ ఓ నాలుగు అడ్డాలలోపోలీసులు  ఇన్వెస్టిగేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొగల్ పురాలో ఆటో డ్రైవర్ అబ్దుల్ రషీద్ (32)ను అదుపులోకి తీసుకున్నారు. రషీద్ చాంద్రాయణగుట్ట స్వస్థలం. అతని ఆటోలోనే చిన్నారి వసంతను కిడ్నాప్ చేశారు.

     తీగ లాగితే డొంక కదిలింది..

    కొత్తూరు పోలీసులు అబ్దుల్ రషీద్ ను అదుపులోకి తీసుకొని విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయని ఏసీపీ కుశాల్కర్ తెలిపారు. ఓ 55 సంవత్సరాల మహిళ అప్సర్ బేగం కందికల్ గేట్ వద్ద నివాసం ఉంటుంది. ఆమె సంతాన సాఫల్యం కోసం చిన్న చిన్న మంత్రాలు చేస్తుందని ఈ నేపథ్యంలోనే పిల్లలు లేని వారికి పిల్లలను అప్పజెప్పితే ఎక్కువ డబ్బులు వస్తాయని దురాశతో ఆటో డ్రైవర్ అబ్దుల్ రషీద్ తో పన్నాగం పన్నింది.

    అయితే హైదరాబాద్ లో పిల్లలను కిడ్నాప్ చేయడం కొంత కష్టమని భావించి, చిన్నపిల్లల కిడ్నాప్ కోసం కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గాను ఎంచుకున్నారు. చిన్నారిని కిడ్నాప్ చేసే క్రమంలో వారికి దర్గా సమీపంలో కూలీ పనులు చేసుకుంటున్న లావణ్య నీళ్ళు తాగడానికి కొంత దూరం వెళ్లిపోగా ఆటోలో వచ్చిన రషీద్ చిన్నారిని కిడ్నాప్ చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అప్సర్ బేగం ఇలాంటి సంఘటనలు ఏమైనా చేపట్టిందా? వీరి వెనుక ఇంకా ఏమైనా కిడ్నాప్ లు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు.

    బుధవారం ఇద్దరిని తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నట్లు ఏసీపి కుశాల్కర్ తెలిపారు. కేసు చేధించడంలో ప్రతిభను కనబరిచిన సీఐ బాలరాజ్ ఎస్ఐ శంకర్ ఏఎస్ఐ షేక్ అబ్దుల్లాను ఏసీపీ అభినందించారు. బుధవారం ఏసీపి కార్యాలయంలో చిన్నారి వసంతను తల్లిదండ్రులకు అప్పజెప్పడంతో కథ సుఖాంతమైంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Kidnap, Mahbubnagar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు