పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు భార్య శైలజకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. లాయర్ దంపతులు వామన్రావ్, నాగమణి హత్య కేసులో ఈ నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. 41 సీఆర్పీసీ కింద పుట్ట శైలజకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. లాయర్ దంపతుల హత్య కేసుకు సంబంధించి.. పుట్ట మధు దంపతుల పాత్ర ఉందని ఐజీకి వామన్రావు తండ్రి కిషన్ రావు ఫిర్యాదు చేశారు. మరోవైపు రామగుండం కమిషనరేట్ కార్యాలయం నుంచి కిషన్ రావుకి ఫోన్ రావడంతో.. ఆయన బయలుదేరి వెళ్లినట్టు తెలిసిందే. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు లాయర్ల జంట హత్యల కేసు చివరికి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మెడకు చుట్టుకుంటోంది. కేసు చార్జిషీటు దాఖలు చేసే సమయంలో గన్మెన్లను వదిలి వారం రోజులపాటు అదృశ్యం కావడంతో ఆయన ప్రమేయంపై పోలీసులు ఆరా తీసే పరిస్థితి తలెత్తింది.
వారం రోజుల క్రితం అదృశ్యమైన మధును శుక్రవారం రాత్రి ఏపీలోని భీమవరంలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పిన పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ.. వామన్రావు హత్య కేసులో ఆయన ప్రమేయంపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి ముగ్గురు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కేసు దర్యాప్తు సాగిస్తున్నారు. ఆదివారం పుట్ట మధును పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు.
లాయర్ల హత్య జరగడానికి ముందు పుట్టా మధు రూ. 2 కోట్లు డ్రా చేసిన వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్య కేసు ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ జైల్లో ఉండగా గుంజపడుగులో నిందితుడి ఇంటి నిర్మాణం శరవేగంగా సాగడంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.