Fake IAS: ఐఏఎస్ అధికారిణి అంటూ బెదిరింపులు.. హోటల్ యజమానికి టోకరా.. చివరికి బండారం భయటపడిందిలా..

మోసాలకు పాల్పడుతున్న మహిళ

Fake IAS: నేనెవరో తెలుసా..? ఐఏఎస్‌ ఆఫీసర్‌ని. నా పేరు ఎప్పుడూ వినలేదా..? అవసరం ఉంటే ఫోన్‌ చేయండి.. ఏదైనా సరే ఇట్టే పనిచేసిపెడతా.. అంటూ ఆమె నమ్మబలికింది. అలా ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు. ఏకంగా నెలల తరబడి ఓ లగ్జరీ హోటల్‌ రూంలో తిష్టవేసింది. చివరకు బండారం భయటపడటంతో కటకటాలపాలయ్యింది. వివరాలిలా..

 • Share this:
  (జి. శ్రీనివాసరెడ్డి, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా) 

  నేనెవరో తెలుసా..? ఐఏఎస్‌ ఆఫీసర్‌ని. నా పేరు ఎప్పుడూ వినలేదా..? అవసరం ఉంటే ఫోన్‌ చేయండి.. ఏదైనా సరే ఇట్టే పనిచేసిపెడతా.. అంటూ ఆమె నమ్మబలికింది. అలా ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు. ఏకంగా నెలల తరబడి ఓ లగ్జరీ హోటల్‌ రూంలో తిష్టవేసింది. ఇన్నిరోజులు ఉన్నా హోటల్‌లో ఉన్నందుకు, తిన్నందుకు ఒక్కరూపాయకి చెల్లించకపోగా.. పైగా ఎదురు డబ్బులు తీసుకుని.. అదేమంటే బెదిరింపులకు పాల్పడింది. దీంతో ఆమెపై అనుమానంతో ఓ కన్నేసి ఉంచిన హోటల్‌ సిబ్బందికి ఆమె ఆధార్‌ కార్డు దొరకడంతో మొత్తం ఆమె కట్టుకథలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఖమ్మంలోని ఓ లగ్జరీ హోటల్‌లో ఉంటూ తన మాటలు నమ్మిన వారికి.. చివరకు ఉంటున్న హోటల్‌ వాళ్లకు టోపీ పెట్టిన మహిళ కథేంటంటే.. కొద్దినెలల క్రితం ఖమ్మంలోని ఓ హోటల్‌కు వాణి అనే పేరుతో ఓ మహిళ వచ్చింది.

  తాను రిటైర్డ్‌ ఆర్డీవోనని.. ఇక్కడ ల్యాండ్‌ మ్యాటర్ సెటిల్‌ చేయడానికి వచ్చానని.. అది సెటిల్‌ అయ్యేదాకా ఇక్కడ నుంచి వెళ్లనని చెప్పింది. దీంతో అసలే కోవిడ్‌తో ఆక్యుపెన్సీ లేక కుదేలైపోయిన హోటల్‌ వాళ్లు మంచి బేరం దొరికిందని సంబరపడ్డారు. ఆమెకు నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఒక్క పైసా బిల్లు తీసుకోకుండా నెలల తరబడి, ఆమెకు బోర్డింగ్‌, లాడ్జింగ్‌ అరేంజ్‌ చేశారు. పైగా తనకు సమయానికి క్యాష్‌ అవసరమని హోటల్‌ నుంచి ఎదురు రూ.80,400 తీసుకుంది. అప్పటికే హోటల్‌ రూం బిల్లు, తిండి బిల్లు కలపి రూ.1.80 లక్షలు అయ్యాయి. ఎప్పుడు బిల్లు అడిగినా తన భర్త అమెరికా నుంచి రావాల్సి ఉందని, రాగానే బిల్లు సెటిల్‌ చేసి రూం ఖాళీ చేస్తానని నమ్మబలికింది. ఆమె మాట తీరు, హావభావాలు చూసిన సిబ్బంది ఆమె మాటలు నిజమేనని నమ్మారు.

  తీరా కొద్ది రోజుల క్రితం బిల్లు విషయమై నిలదీసేసరికి హోటల్‌ వాళ్లపైనే రివర్స్‌ బెదిరింపులకు పాల్పడింది. దీంతో ఏంచేయాలో పాలుపోక.. బిల్లు రాక.. ఇచ్చిన డబ్బు రాక ఏంచేయాలో తోచకుండా ఉన్న హోటల్‌ సిబ్బందికి, ఆమె రూంను శుభ్రం చేయిస్తుండగా ఆధార్‌కార్డు దొరికింది. దాంతో అస్సలు నిజం తెలిసిపోయిన విష్ణు హోటల్‌ మేనేజర్‌ పాములపాటి శ్రీనివాస్‌ ఆమెపై స్థానిక టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె అసలు పేరు పెద్దాడ విజయలక్ష్మి అని, భర్త పేరు కృష్ణమూర్తి అని, ఆమెది గుంటూరు జిల్లా మంగళగిరిగా తేలింది. ఆమె వ్యవహారశైలిపై లోతుగా విచారించిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.

  విజయలక్ష్మి గతంలోనూ మిర్యాలగూడ, హనుమాన్‌జంక్షన్‌లలో పలువురిని మోసం చేసినట్టు గుర్తించారు. తాను సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి సుజాతరావుగా ఒకసారి, ప్రఖ్యాత ఇంజినీర్‌ డాక్టర్‌ కె.ఎల్‌.రావు కుమార్తెగా మరోసారి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సతీమణిగా మరోసారి.. రిటైర్డ్‌ డీజీపీ సతీమణిగా ఇంకోసారి ఇలా పలువురిని మభ్యపెట్టి లక్షలు గుంజినట్టు గుర్తించారు. తన కుటుంబానికి చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌ ఉందని నమ్మించడం, ఉద్యోగాలు, భూముల వ్యవహారంలో అనుకూలంగా పనులు చేసిపెడతానని చెప్పుకుంటూ చాలామందిని మోసం చేసినట్టు గుర్తించారు. దీంతో హోటల్‌ మేనేజర్‌ ఫిర్యాదుపై ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
  Published by:Veera Babu
  First published: