కఠిన చట్టాలు.. భారీగా జరిమానాల కారణంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు కొంత మేర తగ్గాయి. ఐనప్పటికీ కొందరు వాహనదారులు మాత్రం రోడ్లపై ఎలా పడతే అలా డ్రైవ్ చేస్తుంటారు. ఇక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ లేకుంటే.. మరింత చెలరేగి పోతుంటారు. ఓవర్ స్పీడింగ్, సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ దాటి ముందుకు వెళ్లడం వంటి ఉల్లంఘనలతో తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుంటారు. అదే ప్రతి సిగ్నల్ వద్ద పోలీస్ ఉంటే.. ఇలాంటి పప్పులు ఉడకవు. అందుకే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి పనిపట్టేందుకు కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా అలోచించారు. అచ్చం ట్రాఫిక్ పోలీసులను పోలిఉండే బొమ్మలను ప్రధాన కూడళ్ల వద్ద నిలబెట్టారు.
నూతన సంవత్సరం సందర్భంగా కరీంనగర్ బస్టాండ్ ముందు ఈ బొమ్మలను ఉంచారు. ఇవి అచ్చం మనుషుల్లాగే ఉంటాయి. తెల్లని షర్టు, ఖాకీ పాయింట్, షూలు, ట్రాఫిక్ హెల్మెట్‌తో పాటు కళ్లు గుర్తుపట్టకుండా ఉండేందుకు కళ్లజోడు ఉంటాయి. దాంతో అక్కడ నిల్చున్నది ట్రాఫిక్ పోలీసే అని వాహనదారులు భ్రమపడతారు. ఆ భయంతో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించేందుకు ధైర్యం చేయరు. ఇలాంటి ఆలోచనతోనే ఈ బొమ్మ ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేశారు. పోలీస్ బొమ్మలు ఉన్న ప్రాంతంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే అవకాశం ఉండదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimangar, Traffic police, Traffic rules