వీహెచ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. రేవంత్‌రెడ్డి అభిమాని అరెస్ట్..

వి.హనుమంతరావు(ఫైల్ ఫోటో)

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి అభిమాని ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 • Share this:
  కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి అభిమాని ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుకు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడిన కేసులో అతన్ని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. ఇటీవల కాంగ్రెస్ నేత వి హనమంతరావుకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి ఆయనను అసభ్య పదజాలంతో దూషించాడు. రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు వీహెచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు వచ్చిన ఆయన తనకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్‌పై ఫిర్యాదు చేశారు. ఈ చర్యకు పాల్పడ్డ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీహెచ్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని.. వరంగల్ కాశిబుగ్గకు చెందిన కమల్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేశారు.

  ఇక, టీపీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పుకోవడంతో.. కాంగ్రెస్ అధిష్టానం నూతన సారథి వేటలో పడింది. టీపీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై కసరత్తులు జరుపుతోంది. అయితే టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు వస్తున్న వార్తలపై వీహెచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.నాయకత్వ బాధ్యతలు టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు అప్పగించడం సరైనది కాదని వీహెచ్‌ నిరసన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని, ఆర్‌ఎస్‌ఎస్‌ బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చారని విమర్శించారు. అతన్ని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే తాను పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. తనతోపాటు చాలామంది కాంగ్రెస్‌ పార్టీని వీడుతారని వ్యాఖ్యానించారు. పార్టీలోని సీనియర్లను విస్మరిస్తున్నారని, సీనియర్‌ నేతలంతా అసంతృప్తిలో ఉన్నారని అన్నారు. పీసీపీ చీఫ్‌గా పార్టీ కోసం పనిచేసే ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి కూడా పనికి రారా అని ప్రశ్నించారు.

  కాంగ్రెస్‌లో తాను సీనియర్‌ అని.. గాంధీ కుటుంబానికి దగ్గరగా ఉన్నానని వీహెచ్ అన్నారు. తనకు 2018 నుంచి ఇప్పటి వరకూ సోనియాగాంధీని కలవడానికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని, కావాలనే కలవకుండా ఒక వర్గం అడ్డుకుంటోందని ఆరోపించారు. తనకు ప్రాణ హాని కూడా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
  Published by:Sumanth Kanukula
  First published: