PM NARENDRA MODI TO VISIT HYDERABAD ON 2ND JULY TRS TO TAKE RALLY ON SAME DAY IN SUPPORT OF PRESIDENT CANDIDATE YASHWANT SINHA SK
Telangana: బస్తీ మే సవాల్.. ప్రధాని మోదీ వచ్చే రోజే హైదరాబాద్‌లో టీఆర్ఎస్ భారీ ర్యాలీ
ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్
TRS Rally in Hyderabad: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించే రోజే.. నగరంలో భారీ ర్యాలీ నిర్వహిచాలని నిర్ణయించింది. జులై 2న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో... ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు (BJP National Executive Meeting 2022) తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. జులై 2, 3 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సహా బీజేపీ అగ్రనేతలంతా హైదరాబాద్ (Hyderabad) లోనే ఉంటారు. ఈ సమావేశాలను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ సమావేశాల తర్వాత తెలంగాణలో బీజేపీ బలోపేతమవడం పక్కా అని నేతల ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐతే కొన్ని రోజులుగా బీజేపీపై విరుచుకుపడుతున్న సీఎం కేసీఆర్ (CM KCR).. బీజేపీ కార్యకర్గ సమావేశాలపై తమదైన స్టైల్లో కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా అన్నిప్రచార హోర్డింగ్‌లను తమ ఆధీనంలోకి తీసుకుంది. బీజేపీకి అవకాశం ఇవ్వకుండా అంతటా గులాబీ హోర్డింగ్స్, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది టీఆర్ఎస్.
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించే రోజే.. నగరంలో భారీ ర్యాలీ నిర్వహిచాలని నిర్ణయించింది. జులై 2న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో... ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యశ్వంత్ సిన్హాకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జలవిహార్‌కు భారీ ర్యాలీ నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి జల విహార్ వరకు దారిపొడవునా.. గులాబీ జెండాలు, ఫ్లెక్సీలతో నింపబోతున్నారు. ర్యాలీ అనంతరం.. జలవిహార్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సమావేశమవుతారు. వారితో కలిసి భోజనం చేస్తారు. సాయంత్రం కాంగ్రెస్ నేతలతోనూ యశ్వంత్ సిన్హా సమావేశమవుతారు. టీఆర్ఎస్ నేతలతో భేటీ అనంతరం.. సాయంత్రం కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆయన కలుస్తారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ..జలై 2న హైదరాబాద్ రానున్నారు. శనివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్తారు. అనంతరం రోడ్డుమార్గం ద్వారా నోవాటెల్ హోటల్‌కు చేరుకొని.. కార్యకర్గ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం జులై 2,3 తేదీల్లో హైదరాబాద్‌లోనే ప్రధాని మోదీ ఉండనున్నారు. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ జరగనుంది. ఇందుకోసం తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సభా వేదిక, పార్కింగ్, భద్రత ఏర్పాట్లలో కమలనాథులు బిజీగా ఉన్నారు. మోదీ సభకు 10 లక్షల మందిని తరలించేలా ప్లాన్ చేస్తున్నారు. ఐతే జులై 2న ప్రధాని మోదీ వచ్చిన తర్వాతే.. టీఆర్ఎస్ ర్యాలీ ఉంటుందా? లేదంటే ఆయన రాకముందే ర్యాలీ నిర్వహిస్తారా? అనే దానిపై ఇవాళో రేపో క్లారిటీ రానుంది. మొత్తంగా హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య.. నువ్వా నేనా.. అన్నట్లుగా రాజకీయ యుద్ధం జరుగుతోంది. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో ఎలాంటి తీర్మానాలు చేయనున్నారు? బహిరంగ సభలో ప్రధాని మోదీ ఏ మాట్లాడతారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.