(K.Lenin,News18,Adilabad)
తెలంగాణ(Telangana)లో నకిలీ విత్తనాలు, నకిలీ నిత్యవసర సరుకులు, కల్తీ పాలతో పాటు ఇప్పుడు బియ్యాన్ని కూడా కల్తీ చేస్తున్నారు అక్రమార్కులు. రెండు పూటలా పౌష్టికారం తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటే..మార్కెట్‌లో మాత్రం పౌష్టికారం కాదు కదా అసలు కల్తీ లేకుండా ఏ వస్తువు రావడం లేదన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. పండ్లు, నిత్యవసరాల సంగతి పక్కన ప్లాస్టిక్ బియ్యం(Plastic rice)మార్కెట్‌లోకి విచ్చలవిడిగా సప్లై అవుతున్నాయి. నగరాలు, పట్టణాల నుంచి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ రైస్ మండలాలు, గ్రామాల్లోకి చేరిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ (Adilabad District Agency)ప్రాంతాల్లో రేషన్ బియ్యం సరఫరా అవుతున్నాయి. కిరాణ షాపుల్లోనో, సూపర్ మార్కెట్‌లోనో కాదు..ప్రభుత్వం పంపిణి చేసే రేషన్ షాపుల ద్వారా ఈ ప్లాస్టిక్ బియ్యం పేద, మధ్యతరగతి ప్రజలకు చేరుతున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్ (Komuram Bheem Asifabad)జిల్లాలో రేషన్ దుకాణం నుండి తెచ్చిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉండటం కలకలం రేపింది.
బియ్యం కాదు ప్లాస్టిక్ రైస్..
బియ్యం రంగు మారడంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని భూసిమెట్ట, ముక్కెరగూడ గ్రామానికి చెందిన గిరిజనులు ఈ కల్తీ బియ్యం విషయాన్ని బయటపెట్టారు. ఈ గ్రామాలకు చెందిన గిరిజనులు ఓ రేషన్ డీలర్ దగ్గర రేషన్ బియ్యం తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం వండుకున్నాడు. బియ్యం అన్నంగా మారిన తర్వాత రంగు మారడంతో పాటుగా బంకలా జిగురుగా మారడంతో గిరిజనులు ఆశ్చర్యపోయారు. ఈ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లు అనుమానించి వాటికి నిపుపెట్టి కాల్చి చూశారు. కాలిన ఆ బియ్యం ముద్దకావడం, నల్లగా మారడంతో భయాందోళనకు గురయ్యారు.
రేషన్ డీలర్ల ద్వారానే సప్లై..
రేషన్ షాపు ద్వారా సప్లై చేసిన బియ్యాన్ని చూసుకోకుండా వండుకొని తింటే జీర్ణమవుతుందా అని ప్రశ్నిస్తున్నారు గిరిజన బిడ్డలు. రేషన్ షాపు ద్వారా పంపిణి చేసిన బియ్యం నాణ్యతగా లేవని, అవి తింటే ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ డీలర్ల ద్వారా సరఫరా అవుతున్న బియ్యం నాణ్యత న పరిశీలించడంలో పౌరసరఫరాలశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందన్న విమర్శలు వ్యకమవుతున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా మేలైన, నాణ్యమైన బియ్యాన్ని పంపిణి చేయాలని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు కోరుతున్నారు. రేషన్ బియ్యంలో జరిగిన కల్తీపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
ఏజెన్సీలో కలకలం..
ఒకప్పుడు ఏజెన్సీలో సంప్రదాయ పంటలను సాగు చేసేవారు. వాటిని ఉపయోగించి తమ ఆహార అవసరాలను తీర్చుకనేవాళ్లు. ప్రస్తుతం ఏజెన్సీల్లో సైతం సంప్రదాయ పంటల సాగు తగ్గింది. దీంతో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న బియ్యంపైనే ఆధారపడుతున్నారు. అలాంటి వాళ్లకు ఇలాంటి ప్లాస్టిక్ రైస్ సప్లై చేయడం వల్లే పౌష్టికాహార లోపంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికుల, ప్రజాసంఘాలు డిమాండ్ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asifabad, Black rice, Ration dealer