Telangana News: ఆ కలెక్టర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే.. అధికారులపై కేసులు పెట్టండంటూ ఆగ్రహం.. విషయం ఏంటంటే..

కలెక్టర్ కార్యాలయం

Telangana News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు మరోసారి తన విశ్వరూపం చూపారు. జిల్లా ఉన్నతాధికారులపైన, ఇతర అధికారుల పైన అసహనం వ్యక్తం చేస్తూ.. వారందంరిపై కేసులు పెట్టండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేమైందంటే..

  • Share this:
    (జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా)

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు మరోసారి తన విశ్వరూపం చూపారు. జిల్లా ఉన్నతాధికారులపైనా, ఇతర అధికారుల పైనా ఆగ్రహోదగ్రులయ్యారు. గిరిజనులను ఇబ్బందులు పెడుతున్న ఐటీడీఏ అధికారులందరి పైనా కేసులు పెట్టండంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తూ జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. కలెక్టర్‌ సహా రెవెన్యూ, అటవీ, ఐటీడీఏ అధికారులపైనా కేసులు పెట్టాలని ఆదేశించారు. అయితే ఇలా అధికారులపై విరుచుకుపడడం.. ఉన్నఫళంగా ఆదేశాలు ఇవ్వడం రేగాకు కొత్తేమీ కాదు. ముఖ్యంగా అటవీశాఖాధికారులపై ఎప్పటికప్పుడు ఘర్షణ వైఖరి ప్రదర్శించే రేగా ఈ సారి సైతం అదే దూకుడును చూపారు. ప్రభుత్వం చేసిన చట్టాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదని.. రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టాలను అటవీశాఖ అధికారులు ఖాతరు చేయడం లేదని రేగా ఈ సందర్భంగా వాపోయారు.

    అసలు గొడవ ఏంటంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొద్ది ప్రాంతం మినహా దాదాపు అంతా 1\70 చట్టం పరిధిలోకి వచ్చే ప్రాంతమే. అంటే గిరిజనులు మాత్రమే ఇక్కడి భూమిపై హక్కుదారులు. 1970కి పూర్వం భూమిపై హక్కు ఉన్న గిరిజనేతరులు కూడా తమ భూమిని విక్రయించుకోవాలంటే గిరిజనులకు మాత్రమే అమ్మాలి. అనువంశికంగా మాత్రం వారసులకు సంక్రమిస్తుంది. దీంతో ఇక్కడ గత కొన్ని దశాబ్దాలుగా స్థానికంగా ఉంటున్న గిరిజనులు, గిరిజనేతరులకు మధ్య ఓ అగాధం ఏర్పడింది. దీనికితోడు పోడు భూముల వ్యవహారం ఎప్పటికప్పుడు గిరిజనం.. అటవీ శాఖాధికారుల మధ్య చిచ్చు పెడుతోంది. పోడు సాగు తమ హక్కుగా భావిస్తున్న గిరిజనం అడవుల్ని నరికి, ఆక్రమించే ప్రయత్నం చేయడం.. దాన్ని నివారించడానికి ఎక్కడికక్కడ ట్రెంచ్‌లు కొట్టి గిరిజనాన్ని నివారించే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో గతంలో కూడా రేగా కాంతారావు అటవీ అధికారులతో అమీ తుమీ తేల్చుకుంటామని.. ప్రభుత్వాధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి.

    తాజాగా ఆయన భద్రాద్రి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని వేదికగా చేసుకుని మరోసారి చెలరేగిపోయారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయలోపమే కారణంగా భావిస్తున్నారు. రెవెన్యూ శాఖాధికారులు పేదల పేరిట గిరిజనానికి పట్టాలిస్తారు. అవే భూముల్లో సాగు చేస్తుంటే మాత్రం అటవీశాఖాధికారులు వచ్చి కేసులు పెడతారు.. అడ్డుకుంటారు. ట్రెంచ్‌లు కొడతారు. గిరిజనులు వేసుకున్న బోర్లకు కరెంటు కనెక్షన్‌ ఇవ్వరు. కరెంటు పోతే పట్టించుకోరు.. ఇక రోగాలు వస్తే చావే దిక్కు. దీంతో ఈ ప్రాంత గిరిజనంలో అసహనం పెల్లుబికుతోంది. దీని ఫలితంగానే ప్రభుత్వంలో విప్‌గా ఉన్నప్పటికీ రేగాకాంతారావు ప్రభుత్వాధికారుల పైనే నేరుగా విమర్శలు ఎక్కుపెట్టినట్టు కనిపిస్తోంది.
    Published by:Veera Babu
    First published: