ఏపీ కంటే ఇక్కడే అగ్గువ... ఆలోచించిన ఆశాభంగం.. పెట్రోల్ బంక్ యాజమాన్యం ఐడియా అదుర్స్

పెట్రోల్ బంక్ ముందు బోర్డు

ఏదో తూతూ మంత్రంగా వ్యాపారాన్ని ఓపెన్ చేసి నడిపిద్దామంటే కుదరదు. వ్యాపారానికి పెట్టుబడి ఎంత అవసరమో.. ఆ సంబంధిత ప్రొడక్టులకు మార్కెటింగ్ కు అంతకన్న ఎక్కువ అవసరం. అందుకే బడా సంస్థలు వారి ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి ప్రచారానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తాయి. కానీ ఈ పెట్రోల్ బంక్ ఓనర్ మాత్రం..

 • News18
 • Last Updated :
 • Share this:
  ఇది పోటీ ప్రపంచం. ఇక్కడ వ్యాపారాలు చేద్దామని.. ఏదో తూతూ మంత్రంగా దానిని ఓపెన్ చేసి నడిపిద్దామంటే కుదరదు. వ్యాపారానికి పెట్టుబడి ఎంత అవసరమో.. ఆ సంబంధిత ప్రొడక్టులకు మార్కెటింగ్ కు అంతకన్న ఎక్కువ అవసరం. అందుకే బడా సంస్థలు వారి ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి ప్రచారానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తాయి. ప్రచారం ద్వారా వచ్చే ఆదాయం అలాంటిది మరి. పైన కనిపిస్తున్న చిత్రాన్ని చూడండి.. 'తెలంగాణలో చివరి బంక్‌.. ఏపీ కంటే డీజిల్‌ లీటర్‌కు రూ.2.80 తక్కువ.. అదే పెట్రోల్‌ అయితే లీటర్‌కు రూ.3.00 తక్కువ..' ఇలా కనిపిస్తుంటే ఎవరు మాత్రం డబ్బుల్ని అనవసరంగా ఖర్చు చేస్తారు చెప్పండి..? ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్లే దారిలో బోనకల్‌ మండల కేంద్రం దాటిన తర్వాత కనిపించే బోర్డులివి.

  ఇక్కడి నుంచి కేవలం కొద్ది మీటర్ల దూరంలోనే ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ఉంది. ఖమ్మం జిల్లా నుంచి వ్యాపార రీత్యానో.. లేక వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్లే వారి కోసం ఏర్పాటు చేసిన బోర్డులివి. దీంతో బాటుగా సింగరేణి బొగ్గు గనుల నుంచి కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో బొగ్గు లారీలు విజయవాడ థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు వెళ్తుంటాయి. దీంతో ఇక్కడి పెట్రోల్‌ బంకు యాజమాన్యాలు ఇలాంటి ఆకట్టుకునే ప్రచారం చేస్తున్నాయి.

  డబ్బులు ఆదా.. 

  నిజానికి కార్లలో వెళ్లేవారికి సైతం కనీసం 50 లీటర్లు డీజిల్‌ పోయించినా కనీసం రూ.140 ఆదా అవుతాయి. అదే బొగ్గు లారీలైతే మాత్రం తక్కువలో తక్కువ కనీసం ఒక్కో లారీకి కెపాసిటీని బట్టి 200 నుంచి 400 లీటర్ల దాకా పోయిస్తుంటారు. అంటే సగటున వెయ్యి దాకా ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇక పెట్రోల్‌ కార్లయితే ఇంకా ఎక్కువ మిగిలే అవకాశం ఉంది. దీంతో ఈ విషయాన్ని హైలెట్‌ చేస్తూ దారి వెంట ప్రచార హోర్డింగుల్ని ఏర్పాటు చేశారు ఇక్కడి పెట్రోల్‌ బంకు యాజమాన్యాలు. గత కొన్నేళ్లుగా ధరల్లో ఈ తేడా ఉన్నప్పటికీ.. స్థానిక పన్నుల్లో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న వ్యత్యాసం రీత్యా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లలో తేడాలు ఉంటుంటాయి. మొత్తంమీద పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినా, తగ్గినా వ్యత్యాసంలో తేడా రాకపోవడం ఇక్కడ గమనార్హం.  సంబంధాలు బలోపేతం... రవాణాకు తిరుగులేదని.. 

  నిజానికి పేరుకు తెలంగాణ అయినా.. ఖమ్మం జిల్లాకు ఆంధ్ర ప్రాంతంతో విడదీయరాని అనుబంధం. ఇక్కడ గతంలో వ్యవసాయ రీత్యా, వ్యాపార రీత్యా, వాణిజ్యం, ఇంకా గ్రానైట్‌, బైరేటిస్‌, డోలమైట్‌ సహా బొగ్గు గనులు ఉండడంతో రాయలసీమ నుంచి ఇంకా కోస్తాంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్‌ అయిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సెటిలర్ల సంఖ్యను, ప్రభావాన్ని వేరు చేసి చూడలేని స్థాయిలో ఇక్కడ ఉంది. దశాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నప్పటికీ పండుగలు, శుభకార్యాలు ఇతరత్రా పనుల కోసం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి వచ్చే వారి సంఖ్య వేలల్లోనే. దీంతో ఖమ్మం- విజయవాడ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడి రాజకీయ, వ్యాపార ప్రముఖులకు సైతం ఆంధ్రప్రదేశ్‌తో చుట్టరికం, వ్యాపార సంబంధాలు ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఖమ్మం నగరం నుంచి ధంసలాపురం, బోనకల్‌ మీదుగా నేషనల్‌ హైవే దగ్గరగా ఉండడంతో అందరూ సహజంగానే ఈ రూట్‌ను ఎంపిక చేసుకుంటుంటారు. చాలా మంది ఏపీలోని కృష్ణా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు సైతం నిత్యం ఈ మార్గాన్నే అనుసరిస్తుంటారు.

  దీంతో నిత్యం రాకపోకలు సాధారణం. దీన్ని అనువుగా చేసుకుని ఇక్కడ రహదారి వెంబడే ఏర్పాటైన పెట్రోల్‌ బంకులు, డాబాలు, హోటళ్లు రద్దీగా నడుస్తుంటాయి. దీనికి తోడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే పేరుగాంచిన పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి దేవాలయం, తిరుమలగిరి వెంకటేశ్వరస్వామి ఆలయం కూడా ఈ ప్రాంతంలోనే ఉండడంతో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇలా రకరకాల పనుల నిమిత్తం వచ్చిపోయే వారికోసం.. వ్యాపారం పెంచుకునే దానికోసం ఈ తరహా ప్రకటనల బోర్డులు ఏర్పాటు కావడం విశేషం.
  Published by:Srinivas Munigala
  First published: