E.Santosh, News18, Peddapalli
సాయం చేయాలన్న తపన.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలన్న మనస్సు ఉంటే ఏ రూపంలోనైనా చేయవచ్చు. మనం బాగుంటే చాలని కాకుండా ఇతరులకు సాయం చేస్తూ వారి అభ్యున్నతికి బాటలు వేస్తున్నారు పెద్దపల్లి జిల్లా (Peddapalli District) కి చెందిన ఓ మహిళ. సాయం చేయాలంటే ఎంతో ఉండాలి అనేది కాదు ఉన్నదాంట్లో సాయం చేయాలని నమ్మిన ఆమె పేద ప్రజలను చేర దీస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. ఓ వైపు రాజకీయ నాయకురాలిగా, మరోవైపు సమాజ చైతన్యానికి అడుగులు వేస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ధైర్యం కల్పించిన ఆమె.. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే వినతులను పరిశీలించి వారికి అండగా నిలుస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోనికవర్గం పాలకుర్తి మండలం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి రాజకీయాలలో రాణిస్తూనే సామాజిక సేవ చేస్తూ పేద ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇప్పటికే పాలకుర్తి మండలంలోని ఓ నిరుపేద కుటుంబానికి తన సొంత ఖర్చుతో ఇల్లు కట్టించిన సంధ్యారాణి మరో పేద కుటుంబానికి ఇళ్లు నిర్మాణం మొదలుపెట్టారు. రామగుండం నియోజికవర్గం 5వ డివిజన్ చెందినజెల్లాల మల్లయ్య, బానమ్మ భార్య భర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంభం వీరిది. అలాంటి సమయంలోనే గత కొన్ని నెలల క్రితం అకాల వర్షం కారణంగా ఇల్లు పూర్తిగా మునిగిపోయి కూలిపోయింది. దీంతో వీరి పరిస్థితి దయనీయంగా మారింది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో స్పందించిన కందుల సంధ్యరాణి పరామర్శించేందుకు వారి వద్దకు వెళ్లారు.
అక్కడ ఉన్న వారి దయనీయ పరిస్థితి చూసి తానే ఇళ్లు నిర్మాణం చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం వారికి ఇళ్లు నిర్మాణం చేసి ఇచ్చారు. ఇటీవల మంచి ముహూర్తానికి పూజలు నిర్వహించి తానే స్వయంగా కట్టెల పొయ్యిపై పాలు పెట్టి పొంగించారు. అనంతరం కకే కట్ చేసి వారికి స్వీట్ పంపిణీ చేశారు.
ఇంటివారికి అవధులు లేని ఆనందం..!
అకాల వర్షానికి ఇల్లు కూలిపోయి బిక్కు బిక్కుమంటూ ఎటూ దిక్కు తోచని పరిస్థితుల్లో.. మాకు ఏమి కాకపోయినా మా పరిస్థితిని చూసి చలించి సహృదయంతో మాకు నీడనిచ్చిన కందుల సంద్యారాణికి జీవితాంతం రుణ పడి ఉంటామని వారు భావోధ్వేగానికి గురయ్యారు. కొన్ని నెలలు క్రితం వరకు వానోస్తే బురదలో పడుకునే పరిస్థితి ఉండేదని.. ఆ సమయంలో మమ్మల్ని ఎవరు కూడా దగ్గరికి తీయలేదని.. సంధ్యారాణి మా కష్టాలను గుర్తించి మేము అడగకుండానే సొంత ఖర్చులతో ఇళ్లు నిర్మాణం చేసి ఇచ్చారని ఆనందంగా చెప్పారు. బాధలు అనేవి చెప్పి రావు.. దేవుడు కష్టాలను చూడటానికి రాడు.. మనుషులే దేవుడి రూపం అనేది తన సిద్ధాంతమని.. సేవ చేయాలన్నది నా ఉద్దేశం కనుక కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి నాకు ఉన్నదాంట్లో తోచినంత సాయం చేస్తానని కందుల సంధ్యారాణి చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, PEDDAPALLI DISTRICT, Telangana