E.Santosh, News18, Peddapalli
ఎల్ఎల్ఆర్ (Learning Loss Recovery) కోసం ఇంటింటా చదువుల పంట (Whats App chat bot..) అనే కార్యక్రమం స్వల్ప మార్పులతో మళ్లీ ప్రారంభం అయింది. ప్రత్యక్ష తరగతులకు దూరమైన విద్యార్థులు తమ సామర్థ్యాలు పరీక్షించుకునేందుకు గతేడాది విద్యాశాఖ 'ఇంటింటాచదువుల పంట' కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించగా వచ్చే ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం ద్వారా విద్యార్థులు తమ చదువుల సామర్థ్యాలను పరీక్షించుకునే వెసులుబాటు ఆ యాప్ లో కల్పించారు. కాగా ప్రస్తుతం ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ పిల్లల్లో అవగాహన లేమి, అర్థం కాకపోవడం వల్ల శక్తిసామర్ధ్యాలు పడిపోతున్నాయని ఇటీవల నిర్వహించిన సర్వేల ద్వారా తెలుస్తుంది. ఈ క్రమంలో 'ఇంటింటా చదువుల పంట' కార్యక్రమాన్ని తిరిగి అమలు చేయాలని నిర్ణయించిన విద్యాశాఖ అక్టోబర్ చివరి వారంలో తిరిగి ప్రవేశపెట్టింది.
దీనికి సంబంధించిన సూచనలు: ప్రతి పాఠశాలలో, ప్రతి తరగతికి (3 నుండి 10తరగతి) ఒక వాట్సాప్ (whats app) గ్రూప్ క్రియేట్ చేయాలి. గతంలో ఒక నంబర్ ఇచ్చి దాని ద్వారా విద్యార్థులు వర్క్ షీట్స్ ప్రాక్టీస్ చేసేవారు. ఇప్పుడు ప్రతి శనివారం, రాష్ట్రం నుండి జిల్లాకు, జిల్లా నుండి మండల విద్యాశాఖ అధికారులకు ఒక లింక్ వస్తుంది. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి క్లాస్‌కి ఒక గ్రూపు క్రియేట్ చేసి ఆయా పాఠశాలల హెచ్ఎంలకు పంపించగా, హెచ్ఎంలు క్లాస్ టీచర్స్ కు, క్లాస్ టీచర్ పిల్లలకు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆ లింక్‌ను చేరవేయాలి. విద్యార్ధి ఆ లింక్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని, అనంతరం వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఫలితాలు కూడా క్షణాల్లో తెలిసిపోతుంది.
గతంలో ఒక ఫోన్ నంబర్ లో ఒకే విద్యార్థి మాత్రమే జాయిన్ కావడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఒకే నంబర్ పై రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రతి విద్యార్థికి స్కూల్ UDISE కోడ్ తెలియజేయాలి. వీలైతే రిజిస్ట్రేషన్ చేయడంలో ఉపాధ్యాయులు సహకరించాలి. విద్యార్థులు వర్క్ షీట్స్ ఎలా పూర్తి చేయాలో టీచర్లు ఉదాహరణగా తెలియజెప్పాలి.
యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలి:
https://cgweb.page.link/vD3U8e3nr9Vt1U4v5
- ఫోన్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఓటీపీ వస్తుంది
- ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాలి
- హాయ్ (Hi) అని టైప్ చేయడం ద్వారా చాట్ బోట్ స్పందిస్తుంది
- ఇక్కడ భాషను ఎంచుకుని, స్కూల్ లో ఇచ్చే UDISE CODE ఎంటర్ చేయాలి
- పేరు కూడా ఎంటర్ చేసిన అనంతరం సబ్మిట్ చేయాలి
- ప్రాక్టీస్ ఎక్సర్ సైజు ప్రారంభం అవుతుంది
- వెంటనే ఫలితాలు కూడా వస్తాయి (Immediate feedback)
అలా యాప్ ద్వారా నేర్చుకున్న ప్రతి దానిని నోట్ చేసుకొని ప్రతి శనివారం ఇచ్చిన వర్క్ షీట్ ఎక్సర్సైజ్ వచ్చే శుక్రవారం లోగా విద్యార్థులు పూర్తి చేసేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి. ఈ సారి ఎంత మంది విద్యార్థులు పాల్గొంటున్నారు, వారి ప్రగతి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో డాష్ బోర్డు ద్వారా అధికారులు పర్యవేక్షించే వెసులుబాటు కూడా యాప్‌లో కల్పించారు. ఇంటింటా చదువులపంట యాప్ ద్వారా సత్ఫలితాలు రానున్నాయని పెద్దపల్లికి చెందిన ఉపాధ్యాయుడు మధు పేర్కొన్నారు. ఇంటింటా చదువుల పంట కార్యక్రమంలో భాగంగా 'స్విఫ్ట్ చాట్' అనే యాప్ ద్వారా విద్యార్థుల అక్షర పరిజ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం కల్పించడం శుభపరిణామమని అన్నారు. ప్రతి విద్యార్థికి ఉపయోగకరంగా ఉన్నది ప్రతి వారం పాఠశాలల్లో బోధించే వాటిని సరిగ్గా ఆచరించడానికి సహాయపడుతుందని ప్రధాన ఉపాధ్యాయుడు మధు అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana