Home /News /telangana /

PEDDAPALLI WHY ARE FOREIGN COUNTRIES ORDERING ONLY PEDDAPALLI SULTANPUR PINDIVANTALU AND WHY SO SPECIAL BRV PSE PRV

Peddapalli: అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా సుల్తాన్‌పూర్ సారె వెళ్లాల్సిందే.. ఎందుకంత స్పెషల్​?

పెద్దపల్లి

పెద్దపల్లి పిండివంటలు

తమతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. తమ చేతి పిండి వంటలతో ఎంతో మంది కస్టమర్లను పోగేసుకున్న ఆ మహిళలు..దేశ విదేశాలకు సైతం తమ పిండి వంటలను ఆర్డర్లపై సప్లై చేస్తున్నారు

  (E.Santosh, News 18, Peddapalli)

  పిల్లలకు పెళ్ళిళ్ళు (Marriage) చేసి హాయిగా మనవళ్లతో కాలం గడపాల్సిన వయసులో కూడా ఆ మహిళలు స్వయం ఉపాధితో ముందుకు సాగుతున్నారు. తమతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. తమ చేతి పిండి వంటలతో ఎంతో మంది కస్టమర్లను పోగేసుకున్న ఆ మహిళలు.. దేశ విదేశాలకు సైతం తమ పిండి వంటలను ఆర్డర్లపై సప్లై చేస్తున్నారు. పెళ్లిలో భోజనాలు ఎంత ముఖ్యమో.. అనంతరం పెట్టే సారె (Saare) కూడా అంతే ముఖ్యం. సారె ఘనంగా ఇవ్వాలని చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు. వీటి కోసం ఇంట్లో చేసిన వంటలే కాకుండా.. బయట ఆర్డర్లు ఇచ్చి మరి పిండి వంటలు కొనుగోలు చేస్తున్నారు.

  సుల్తాన్‌పూర్ (Suthanpur) మహిళలు తయారు చేస్తున్న పిండి వంటలు తప్పనిసరిగా తమ సారెలో ఉండే విధంగా చూస్తున్నారు. భారీ సైజుల్లో లడ్డూలు, సకినాలు, అరిసెలూ.. ఇతర పిండి వంటలు తయారు చేస్తున్నారు. ఒక్కో లడ్డూ కిలో పరిమాణంలో ఉంటే, కజ్జికాయ ఒక్కోటి అర కిలో ఉంటుంది. 30 వరుసల్లో పెద్ద చక్రాల్లా సకినాలు ఉంటాయి. ఇలా చూడగానే నోరూరించే పిండి వంటలు తయారు చేస్తూ స్వయం ఉపాధితో పాటు స్థానికంగానూ ఈ మహిళలు మంచి పేరు తెచ్చుకున్నారు.  వారికొచ్చిన రెండో ఆలోచనే..

  తెలంగాణలోని పెద్దపల్లి (Peddapalli) జిల్లా, సుల్తానాబాద్ మండలం, సుల్తాన్‌పూర్‌లో కొందరు మహిళలు ప్రత్యేక ఆర్డర్లపై పిండి వంటలు తయారు చేస్తున్నారు. 13 ఏళ్ల కిందట గ్రామానికి చెందిన సుభాషిణి, సుజాత, రమాదేవిలు ఖాళీ సమయంలో ఏదైనా పనిచేస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో కాగితపు విస్తర్ల తయారీ గురించి ఆలోచించారు. కానీ దానికి భారీ పెట్టుబడి అవసరం ఉండడంతో.. తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈక్రమంలో వారికొచ్చిన రెండో ఆలోచనే భారీ సైజు పిండి వంటల తయారీ. పూర్వం రోజుల్లో భారీ సైజులో వంటకాలు చేసేవాళ్లు. కానీ కాలం మారేకొద్ది అంత సైజు వంటకాలను చేయడం తగ్గించారు. అటువంటి వంటకాలు తయారు చేస్తే మంచి ఉపాధి ఉంటుందని గ్రహించి ముగ్గురు మహిళలు తమతో పాటు ఆసక్తి ఉన్న మరికొందరితో కలిసి పిండి వంటల తయారీ ప్రారంభించారు. ఒక్కో పిండి వంట తయారీలో నైపుణ్యం ఉన్నవారిని గుర్తించి 10 మంది మహిళలు ఒక సంఘంగా ఏర్పడ్డారు. మొదట్లో చిన్న మొత్తంలోనే ఆర్డర్లు వచ్చేవి. అయినా వెనకడుగు వేయలేదు. అధైర్య పడలేదు.

  ఆర్డర్‌ ఏ స్థాయిలో వచ్చినా నాణ్యమైన నెయ్యి, బాదం, జీడిపప్పు, సన్నబియ్యం, వంట నూనె…మొదలైన పదార్ధాలు వినియోగించడంతో పాటు రుచి, శుభ్రత విషయంలోనూ నాణ్యమైన వంటలు చేయడం ప్రారంభించారు. ఈక్రమంలో ఒక పెద్ద ఆర్డరు వారి దశను మార్చివేసింది. "చిన్న చిన్నగా సాగుతున్న వ్యాపారం ఓ పెద్ద వ్యక్తి నుండి పెద్ద మొత్తంలో ఆర్డర్ వచ్చిందని అప్పటి నుండి మాకు సమయం లేకుండా ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. తమ వంటలను ఒక్కసారి రుచి చూసిన వాళ్ల ద్వారా మరికొన్ని ఆర్డర్లు వస్తున్నాయి" అని భాగ్యలక్ష్మి వివరించారు.

  గరిజ, బెల్లం అరిసెలూ, నువ్వుల లడ్డూ, మురుకులు, చెగోడీలూ, గవ్వలు.. ఇలా పలు రకాల పిండి వంటలు చేయడంలో వీళ్లు ప్రత్యేక గుర్తింపు సాధించారు. వీరి వద్ద గ్రామంలో మరో 200 మంది మహిళలూ ఉపాధి పొందుతున్నారు. వీరికి వచ్చే ఆర్డర్లు రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకూ ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్‌లో నెలకు ప్రతి సంఘానికి రూ.10 లక్షలకు తగ్గకుండా ఆర్డర్లు వస్తాయని మహిళలు అంటున్నారు. ఇక్కడ తయారైన వంటకాలు అమెరికా, ఇంగ్లాండ్, స్విజర్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు కూడా పంపిస్తున్నారు. రెండేళ్ల క్రితం తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈ జిల్లాకు వచ్చినపుడు సుల్తాన్‌పూర్‌ వంటకాల్ని రుచి చూసి మహిళల్ని ఎంతో మెచ్చుకున్నారు.

  ఒక గ్రూపుతో మొదలై, ఏడు గ్రూపులుగా:

  మొదట ఒక గ్రూపుతో మొదలైన వ్యాపారం, ప్రస్తుతం ఏడు గ్రూపులుగా విస్తరించారు. వ్యాపార అవకాశాన్ని బట్టి గ్రూపుకు పది మంది చొప్పున 70 మంది మహిళలకు ప్రస్తుతం ప్రత్యక్షంగా వ్యాపారంలో ఉండగా... పరోక్షంగా వంద మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. ఆర్డర్ల కోసం ఎవరైనా తమను నేరుగా సంప్రదించవచ్చని అంటున్నారు.

  ఫోన్ నంబర్లు: భాగ్యలక్ష్మి +91-8985037763, లక్ష్మీదేవి +91-9573295740.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Food, Local News, Peddapalli

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు