E.Santosh, News18, Peddapalli
చిరుతల రామాయణం తెలంగాణా ప్రాంతంలో చాలా వ్వాప్తి చెందిన కళ. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా (Karimnagar District) లో చిరుతల రామాయణం కళ నాటకాలు పలు గ్రామాల్లో ఆనవాయితీగా నడుస్తూనే ఉన్నాయి. పల్లెల్లోని శ్రామిక యువకులు ముప్పై నలబై మంది కలిసి వేసవి కాలంలో ఒక గురువును నియమించుకుని చిరుతల రామాయణాన్ని ప్రాక్టీస్ చేసి ప్రదర్శిస్తారు. పెద్దపల్లి జిల్లా (Peddapalli District) అంతర్గాం మండలంలోని ఆకేనపల్లి గ్రామంలో సుమారు 3 రోజుల పాటు చిరుతల రామాయణం గ్రామ సర్పంచ్ ప్రజల సహకారాలతో కళను ప్రదర్శిస్తున్నారు. ఒక్కో పాత్ర ప్రవేశించి పరిచయం చేసుకునే సమయంలో ప్రేక్షకులు కరతాణ ధ్వనులతో వారిని ఉత్సాహ పరుస్తారు. ఇలా రాత్రంతా రామాయణం గానంచేసి, ఉదయం శ్రీ రాముని పట్టాభిషేక మహోత్సవం చేస్తారు.
ఈ ఉత్సవానికి ఊరి జనమంతా కదిలివస్తారు. ఎత్తైన ప్రదేశంలో సీతారాములుగా పాత్రధారులను కూర్చోపెడతారు. కొంచెం క్రింద లక్ష్మణుని పాదాల ముందు హనుమంతుడు కూర్చొని వుంటాడు. ఉత్సవ సమయంలో సీతారాములకు చీరలు, పంచెలు, డబ్బులు పెట్టి దేవతామూర్తులగా వారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. సినిమాలు వచ్చిన తరువాత చిరుతల రామాయణం వంటి కళల పట్ల కొంచెం ఆదరణ తగ్గుతూ వున్నా, కొన్ని పల్లెల్లో ఇప్పటికీ ఆదరణ చెక్కుచెదరడం లేదు.
చిరుతల రామాయణం అని ఎందుకు అంటారు..?
ఊరులో విశాలమైన స్థలంలో వేదిక ఏర్పాటు చేసుకుని చిరుతలు పట్టుకుని, రకరకాల దేవుళ్ళ, ఇతర వేషధారణలతో కాళ్ళకు గజ్జెలు కట్టుకుని పాట పాడుతూ నృత్యం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. నిజానికి ఇది మన కోలాటం లాంటిదే కాగా.. వీరు ముఖ్యంగా కోలాటం పాటల కంటే చిరుతలతో నృత్యం చేస్తూ రామాయణ, మహాభారత కథలను తీసుకుని బృద సభ్యులే పాత్రలుగా వ్వవహరించటం వల్ల దీనికి చిరుతల రామాయణమని పేరు వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana