ఇంట్లో ఎలుకల బెడదను తొలగించేందుకు చేసిన పని ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎలుకలకు మందు పెట్టే సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడం ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండలం విసంపేటకు చెందిన దారబోయిన శ్రీశైలంకు భార్య గుణవతి, ఇద్దరు పిల్లలు శివానంద్, శరణ్ ఉన్నారు. అయితే ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉండటంతో.. వాటికి బుధవారం రాత్రి మందు పెట్టారు. అయితే ఎలుకలు వారు పెట్టిన తర్వాత కర్బూజ కాయను తిన్నాయి. అయితే గురువారం రోజున అదే పండును కుటుంబ సభ్యులు కూడా కోసుకుని తిన్నారు. శ్రీశైలంతో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు, పిల్లల బామ్మ కర్బూజ కాయను తిన్నారు.
అయితే కర్బూజను తిన్న కొద్దిసేపటికి ఆ ఐదుగురు అస్వస్థతతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ పిల్లలు నందు(11), శరణ్(13) మృతిచెందారు. తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. మరోవైపు వృద్ధురాలి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇక, పుచ్చకాయ తినని పిల్లల తాతయ్య క్షేమంగా ఉన్నాడు. ఇక, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.