E.Santosh, News18, Peddapalli
సాధారణంగా వేసవికాలం వస్తే చాలు ప్రజలంతా శీతల పానీయాలు తాగేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటికి డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే వేసవి కాలంలో తీసుకునే శీతల పానీయాలు ఆరోగ్యానికి మేలు చేసేవి అయితే వాటికి ఉండే డిమాండ్ చెప్పనక్కర్లేదు. ఈకోవలోకే చెందుతుంది ఫ్రూట్ సలాడ్. పలు రకాల తాజా పండ్ల మిశ్రమంతో తయారు చేయబడే ఈ ఫ్రూట్ సలాడ్ ఆరోగ్యానికి కూడా కాస్త మేలి చేస్తుందని ప్రజలు నమ్ముతుంటారు. అయితే లాభసాటి వ్యాపారమైన ఈ ఫ్రూట్ సలాడ్ బిజినెస్ ను గత 20 ఏళ్లుగా కొనసాగిస్తున్నాడు శ్రీనివాస్.
పెద్దపల్లి జిల్లా (Paddapalli District) గోదావరిఖని పట్టణంలోని గాంధీ చౌరస్తాలో సాయి సూపర్ కూల్ డ్రింక్స్ పేరుతో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఫ్రూట్ సలాడ్ తయారు చేయడంలో సిద్ధహస్తుడు. చక్కని రుచితో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తుండడంతో శ్రీనివాస్ తయారుచేసే ఫ్రూట్ సలాడ్ ను గోదావరిఖని పట్టణ వాసులు ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. అంతేకాకుండా సిటీకి నడిబొడ్డున ఈయన వ్యాపారం నిర్వహిస్తుండడంతో వేసవికాలం పొడుగుతా ఈయన వ్యాపారం మూడు జూసులు ఆరు ఫ్రూట్ సలాడ్లుగా సాగుతుంది.
అయితే నిర్వహకుడు శ్రీనివాస్ ఫ్రూట్ సలాడ్ తయారీ విధానాన్ని న్యూస్ 18కు వివరించారు. స్వచ్ఛమైన పాలను సేకరించి బాగా మరిగించిన తర్వాత కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని జత చేసి ఇందులో కొనుగోలుదారుల ఆసక్తి మేరకు ఆపిల్ ముక్కలు, అరటి పండ్లు, దానిమ్మ గింజలు కలపడంతో ఫ్రూట్ సలాడ్ తయారుచేస్తామని ఆయన తెలిపారు. మార్కెట్లో లభించే నాణ్యమైన పదార్థాలను మాత్రమే కొనుగోలు చేస్తానని శ్రీనివాస్ తెలిపారు. ఇలా పండ్లు, పాలు, కస్టర్డ్ పౌడర్, పండ్ల ముక్కలు కలిపిన మిశ్రమాన్ని కొద్దిసేపు ఫ్రీజర్ లో నిల్వ చేయడంతో అది కాస్త రుచిని సంతరించుకుంటుందని శ్రీనివాస్ అన్నారు.
ఇలా తయారైన మిశ్రమాన్ని ఫ్రూట్ సలాడ్ పేరుతో విక్రయిస్తుండగా గోదావరిఖని పట్టణానికి చెందిన ప్రజలు ఫ్రూట్ సలాడ్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని.. ఈ క్రమంలో రోజుకు మూడు నుంచి నాలుగు వేల వరకు బిజినెస్ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ఫ్రూట్ సలాడ్ తో పాటు ఆయన దుకాణం నందు ఐస్ క్రీం, బాదం పాలు, సుగంధ బాదం, సుగంధ ఫ్రూట్ మిక్స్, లెమన్ వాటర్, ఆరెంజ్ వాటర్ ఇలా తదితర శీతల పానీయాలను సైతం ఆయన విక్రయిస్తున్నట్లు తెలిపారు. మీరు కూడా ఓసారి గోదావరిఖని వైపు వస్తే శ్రీనివాస్ తయారు చేసే ఫ్రూట్స్ సలాడ్ ను టేస్ట్ చేసి రుచిని ఆస్వాదించండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Food, Local News, Peddapalli, Telangana